ఎమ్మెల్యేగా పోటీ చేయను
– మళ్లీ కర్నూల్ ఎంపీగానే పోటీ చేస్తా
– స్పష్టం చేసిన ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు, మే26(జనం సాక్షి) : వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. 2019 ఎన్నికల్లో మళ్లీ కర్నూలు ఎంపీగానే పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈసారి మాత్రం టీడీపీ తరుపున కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు వచ్చిన వార్తలను ఆమె కొట్టి పారేశారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం నుంచి మాత్రం తాను పోటీ చేయట్లేదని తెలియజేశారు. ఎమ్మిగనూరులో రూ.9.78లక్షలతో నిర్మించిన నీటి ట్యాంక్‌ను బుట్టా రేణుక శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకుంటుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, కానీ బీజేపీ ఏపీ ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మొక్కవోని విశ్వాసంతో చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తూ రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటుఅభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నారని అన్నారు.