Wednesday, 4 November 2026

ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

4

హైదరాబాద్‌,మే14(జనంసాక్షి):

తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ఖాళీ అయిన స్థానాల భర్తీకి ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ భర్తీ పక్రియ ద్వారా ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలు భర్తీ కానున్నాయి. గురువారం  నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల దరఖాస్తులను స్వీకరించనున్నారు. 22న దరఖాస్తుల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు 25వ తేదీ వరకు గడువు ఉంటుంది.  వచ్చే నెల ఒకటవ తేదీన ఎన్నికల ఓటింగ్‌ జరిపి  అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఒకవేళ ఆరు నామినేషన్లు మాత్రమే దాఖలైతే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఇదిలావుంటే  తెలంగాణ శాసనమండలికి అభ్యర్థులెవరన్నది 15వ తేదీ తర్వాతనే సిఎం కెసిఆర్‌ ఖరారు చేయనున్నట్లు సమాచారం. 21వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా నాలుగు సీట్లు టిఆర్‌ఎస్‌కు, ఒకసీటు కాం/-గరెస్‌కు దక్కనుంది. ఇందులో ఆరోసీటు కోసం టిఆర్‌ఎస్‌ వ్యూహాలు రచిస్తోంది. టిడిపిని దెబ్బకొట్టి ఆరోసీటును కూడా కైవసం చేసుకునేందుకు ప్లాన్‌ వేస్తోంది. అధికార తెరాస పార్టీ శాసనమండలి ఎన్నికలకు సిద్ధమవుతూనే ఆరోసీటుపై కన్నేసింది. ఇక టిక్కెట్ల కోసం టిఆర్‌ఎస్‌లో పోటీ ఎక్కువగానే ఉంది. అయితే ఇప్పటికే అనేకమంది ఎమ్మెల్సీల కోసం పోటీ పడుతున్నారు. ఇందులో పాత,కొత్త కాపులు అనేకమంది టిక్కెట్లు ఆశిస్తున్నారు. కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావులకు మాత్రం దాదాపుగా బెర్తులు ఖరారయ్యాయని అంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఇటీవల వరకు పనిచేసి పదవీవిరమణ చేసిన యాదవరెడ్డి, కె.ఆర్‌.ఆమోస్‌, నాగపురి రాజలింగం, బాలసాని లక్ష్మీనారాయణ, బొడకుంటి వెంకటేశ్వర్లులో ముగ్గురికి అవకాశం ఇవ్వనున్నారు. టిడిపి నుంచి వచ్చిన బాలసాని, బొడకుంటి వెంకటేశ్వర్లలో  ఒకరికి ఖాయమని తెలుస్తోంది. సామాజికవర్గం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని అవకాశం కల్పించనున్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఆమోస్‌, యాదవరెడ్డి, నాగపురి రాజలింగంలలో ఒకరికి ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీలుగా పనిచేసి పదవీవిరమణ చేసిన వారికే ఇస్తారా.. లేక ఇప్పటివరకు ఏలాంటి అవకాశం రాని పార్టీ నేతలకు అవకాశం కల్పిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. ఎన్నికలు జరగనున్న 6 స్థానాలకు అధికార పార్టీకి 4 స్థానాలు దక్కడం ఖాయం. నాలుగు స్థానాల్లో ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లే. మంత్రి పదవుల్లో ఉన్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల్లో గతంలో ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్‌, తెదేపాల్లో పనిచేసి తెరాసలో చేరిన వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.   శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా స్థానాలకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెల్సిందే. ఎమ్మెల్యే కోటాలో ఎవరెవరికి అవకాశం దక్కుతుందున్న దానిపై పార్టీ నాయకుల్లో చర్చ మొదలైంది. శాసనమండలి చైర్మన్‌ ఎన్నికప్పుడు సహకరించడంతోపాటు తెరాసకి అండగా ఉన్నారని.. ఇలాంటి వారికి మరోసారి అవకాశం ఇవ్వాలన్న వాదన వ్యక్తమవుతోంది. ఇక్కడ కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం కల్పించనున్నారు. టిడిపిని  దెబ్బకొట్టేందుకు ఐదో స్థానానికి అభ్యర్థిని నిలబెట్టే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే పదవీవిరమణ చేసిన వారిలో కొంతమందికి అవకాశం ఇవ్వడంతోపాటు పార్టీ కోసం దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్‌ కూడా ఉంది. ఇలాఇచ్చే అవకాశం ఉంటే కరీంనగర్‌కు చెందిన నారదాసు లక్ష్మణరావు, మెదక్‌ జిల్లా టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆర్‌.సత్యనారాయణ, పార్టీ నేతలు బొంతు రామ్మోహన్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరుల పేర్లు కూడా వినపడుతున్నాయి. ఇకపోతే ఇటీవల వరకు డిప్యూటీచైర్మన్‌గా వ్యవహరించిన నేతి విద్యాసాగర్‌ను ఇప్పుడే సర్దుబాటు చేయాలన్న చర్చ జరుగుతోంది. ఆయనను ఎమ్మెల్యే కోటాలో పంపే అవకాశం ఉంది. ఒకవేళ ఎమ్మెల్యే కోటాలో సాధ్యం కాకపోతే గవర్నర్‌ కోటాలో తిరిగి మండలికి పంపించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే సిఎం కెసిఆర్‌కు సన్నిహితంగా ఉండే మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత ఢిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి కూడా తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయితే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. వీరే కాకుండా ఉద్యమంలో పనిచేసిన అనేకమంది ఎమ్మెల్సీల సీట్లను ఆశిస్తున్నారు. అధినేత కెసిఆర్‌ మదిలో ఏముందన్నది 15 తరవాత వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *