హైదరాబాద్‌ స్వచ్ఛతకు సహకరించండి

2
– విపక్షనేతలతో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,మే14(జనంసాక్షి): స్వచ్ఛ హైదరాబాద్‌తో నగరాన్ని శుభ్రం చేయడంతో పాటు  అంతర్జాతీయ స్థాయిలో విశ్వనగరంగా చేయసంకల్పించినట్లు ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెప్పారు. ఇందుకు ఈ నెల 16 నుంచి స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేప్టటామని అన్నారు. సచివాలయంలో గురువారం నగర ప్రజాప్రతినిధులతో సిఎం సవిూక్షించి, లక్ష్యాలను వివరించారు. అందరూ పాల్గొని హైదరాబాద్‌ అభివృద్దికి తోడ్పాటును అందించాలన్నారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్రమంత్రులు,సిఎస్‌ రాజీవ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల తీసుకున్న నిర్ణయాలను సిఎం వివరించారు. స్వచ్ఛ భారత్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సవిూక్ష సమావేశం ముగిసింది. స్వచ్ఛభారత్‌ను తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ భాజపా శాసనసభాపక్ష నేత డా.లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సవిూక్ష సమావేశానికి హాజరైన ఆయన అనంతరం విూడియాతో మాట్లాడారు. నగర అభివృద్ధికి అన్ని పార్టీల సలహాలు తీసుకుంటామని సీఎం చెప్పినట్లు లక్ష్మణ్‌ తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్‌పై ఇక నుంచి ప్రతినెలా సవిూక్ష చేస్తామని సీఎం హావిూ ఇచ్చారని తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజాప్రతినిధులంతా సీఎం వద్ద అనేక సమస్యలు ప్రస్తావించినట్లు లక్ష్మణ్‌ చెప్పారు.  ఈ సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఉపముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, గ్రేటర్‌ మంత్రులు, అన్ని పార్టీలకు చెందిన గ్రేటర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెదేపా, భాజపా ప్రజాప్రతినిధులు సీఎంకు తమ అభ్యంతరాలను తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్‌పై నగర ఎమ్మెల్యేలకు ముందస్తుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని నేతలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తానని హావిూ ఇచ్చారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఈనెల 26న మరోసారి భేటీ అయ్యి విధానాల్లో మార్పులపై చర్చిద్దామని కేసీఆర్‌ నేతలకు స్పష్టం చేశారు. ఇదిలావుంటే మిషన్‌కాకతీయ పనుల్లో భాగంగా తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీష్‌రావులు గురువారం బంజారాహిల్స్‌లోని పలు చెరువులు ఉద్యానవనాలను ఉదయం పరిశీలించారు. వారివెంట ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతెల రామచంద్రారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నత అధికారులు, జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌ ఉన్నారు. వీరంతా బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కుతో పాటు లోటస్‌పాండ్‌, రాక్‌పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ నగరంలోని 30 చెరువులను మినీ ట్యాంక్‌బండ్లుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. నగరంలో ఆహ్లాదం కలిగించే పార్కులు, చెరువులు ఉన్న 1000 ప్రాంతాల్లో నగర వాసుల సౌకర్యార్ధం గ్రంథాలయాలు, వ్యాయామశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. చెరువుల పరిరక్షణ కోసం శాసన సభ ద్వారా నూతన చట్టాన్ని తెస్తామన్నారు.