Wednesday, 4 November 2026

.సీబీఐ మాజీ చీఫ్‌ రంజిత్‌ సిన్హాకు చెంపదెబ్బ

3

– నిందితులతో ఎలా సమావేశమవుతావు?

– సమగ్ర విచారణకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ,మే14(జనంసాక్షి): సీబీఐ మాజీ చీఫ్‌ రంజిత్‌ సిన్హాకు సుప్రీంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొగ్గు స్కాంలో నిందితులను రక్షించే ప్రయత్నం చేసినందుకు ఆయనపై విచారణ జరగాల్సిందేనని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఈ స్కాంలో నిందితులను పలుమార్లు రంజిత్‌ సిన్హా కలవడం ఏమాత్రం సరికాదని, దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఇలా చేయడం ముమ్మాటికీ తప్పేనని, దీనిపై విచారించాలని జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అధికార దుర్వినియోగం కేసులో సీబీఐ మాజీ చీఫ్‌ రంజిత్‌ సిన్హాను విచారణ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ డైరెక్టర్‌ ¬దాలో ఉండి టెలికాం స్కాంలో ఉన్న నిందితుడిని కలవడాన్ని సుప్రీం తప్పుబట్టింది. రంజిత్‌ సిన్హాను ఎలా విచారించాలన్న దానిపై సీవీసీదే నిర్ణయమని కోర్టు పేర్కొంది. రంజిత్‌ సిన్హాపై లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ అదేవిధంగా ఢిల్లీ వేదికగా పనిచేసే ఓ ఎన్‌జీవో సంస్థ దాఖలు చేసిన ఆరోపణల పిటిషన్ల ఆధారంగా సుప్రీం విచారణను చేపట్టింది. సీబీఐ మాజీ చీఫ్‌పై విచారణ ఎలా జరగాలో నిర్ణయించడంలో సహకరించాలని చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్ను సుప్రీంకోర్టు కోరింది. జూలై ఆరోతేదీ లోగా ఈ విషయమై తన సమాధానం చెప్పాలని తెలిపింది. రంజిత్‌ సిన్హాపై సిట్తో దర్యాప్తు చేయించాలంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ దాఖలుచేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం ఈ ఆదేశాలిచ్చింది. సిన్హా ఇంటివద్ద ఉన్న అతిథుల జాబితా డైరీని బట్టి చూస్తే.. కోల్గేట్‌ స్కాంలోని పలువురు నిందితులు ఆయనతో ప్రత్యక్షంగా టచ్‌లో  ఉన్నట్లు తెలుస్తోందని, అంటే వాళ్లను రక్షించేందుకు ఆయన ప్రయత్నించినట్లే భావించాలని కూడా సుప్రీం వ్యాఖ్యానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *