ఏపీ విడిపోవడానికి మొదటి ముద్దాయి చిరంజీవే

– విూ అన్న ఇంత ద్రోహం చేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదు
– రక్త సంబంధం అడ్డొస్తోందా
– టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌
ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా)(జ‌నం సాక్షి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోవటానికి మొదటి ముద్దాయి విూ అన్న చిరంజీవి అని, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చిరంజీవిని ఎందుకు ప్రశ్నించండం లేదని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నిప్పులు చెరిగారు.  ఏలూరు మండలం మాదేపల్లి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని అన్నారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవిల పై విరుచుకుపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ కోసం కాపు సోదరులు ఆస్తులు అమ్మి మద్దతు ఇస్తే వాళ్లను బలి పశువు చేసింది చిరంజీవి కాదా అని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని బంగాళాఖాతంలో కలిపిన ఘనత చిరంజీవిదేనని ఎద్దేవా చేశారు. విూ అన్న చిరంజీవి ఇంత ద్రోహం చేస్తే ఎందుకు అడగలేక పోతున్నావని పవన్‌ను చింతమనేని ప్రశ్నించారు. చిరంజీవిని ప్రశ్నించడానికి రక్తసంబంధం అడ్డొస్తుందా అని మండిపడ్డారు. అలాంటి వాడివి ప్రజారాజ్యం పార్టీని నడిపించలేకపోయావా, జనసేన పార్టీ ఎందుకు పెట్టావు అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోనడిపిస్తున్న ఘనత చంద్రబాబుది అన్నారు. కేంద్రం సహకరించకపోయినా, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా అన్ని కుట్రలను చేధించి ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు పట్టదలతో పాలన సాగిస్తున్నారని ప్రభాకర్‌ కొనియాడారు.అ లాంటి వ్యక్తికి మద్దతుగా నిలవటం మాని ఏపీ ప్రజలను నిలువునా ముంచిన బీజేపీ ప్రభుత్వానికి జగన్‌, పవన్‌ కళ్యాణ్‌లు మద్దతు పలుకుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ రెచ్చిపోతున్నారని, నన్ను ఓడించి, జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని ఊగిపోతున్నారని అన్నారు. విూరు కాదు విూ జేజేమ్మలు దిగొచ్చినా నన్ను ఓడించలేరని చింతమనేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తాజావార్తలు