
నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు
ఎన్నోసార్లు చెప్పా : బాబు
హైదరాబాద్, జూలై 6 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ఒక్కసారి కూడా చెప్పని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యతిరేకం కాదని మాత్రం చెప్పాడు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పానని బాబు బుకాయించాడు. రంగారెడ్డి జిల్లా కొంపల్లిలో జరుగుతున్న పార్టీ ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణా అంశంపై ఇదివరకే చెప్పామని, పరిష్కరించాల్సింది కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తాము ఎట్టిపరిస్తితుల్లోను అడ్డుకోబోమన్నారు. టిడిపి ఇటు తెలంగాణాలోను, అటు సీమాంధ్రలోను బలంగానే ఉందన్నారు. నాయకులు పార్టీని వీడుతున్నారే తప్ప కార్యకర్తలు మాత్రం పార్టీకే అంకితంగా పనిచేస్తున్నారన్నారు. నాయకులు పోతున్నది కేవలం పదవులను కాపాడుకోవడానికేనన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కేసులు మాఫీ చేస్తామన్నారు. అలాగే ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలను కూడా అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. తమ పార్టీ వైఖరిని అర్థం చేసుకున్న నేతలు తిరిగి తమ గూటికి వస్తున్నారన్నారు. ఇందుకు ఉదాహరణెళి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన డికె సమరసింహారెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకోవడమన్నారు. రాబోయే రోజుల్లో కూడా చాలామంది తెలంగాణా నేతలు టిడిపిలోకి రానున్నారని బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను తక్షణమే అరికట్టాలని కాంగ్రెస్ను బాబ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రావణకాష్టం జరుగుతున్నా కూడా కేంద్రం చూస్తూ కూర్చోవడం దౌర్బగ్యమన్నారు. ఓవైపు రాష్ట్ర ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్రంలోని కాంగ్రెస్ మాత్రం చోద్యం చూస్తోందని ఆరోపించారు. వాస్తవాలను ప్రజల్లోకి ఒకటికి నూరుసార్లు తీసుకెల్లి ఒప్పించి అర్థం చేయించే పనిని చేయాలన్నారు. కార్యకర్తలు తలుచుకుంటే సైకిల్ దూకుడును ఎవరూ అడ్డుకోలేరన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న పంచాయితీ ఎన్నికలను హస్తగతం చేసుకోవాలని, దీని ద్వారా తెలుగుదేశం సత్తాను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఒక్కసారి కూడా అనుకూలమని చెప్పలేదే




