ఢిల్లీలో తెలంగాణ చకచక

సోనియా, రాహుల్‌తో దిగ్విజయ్‌ భేటీ

తెలంగాణకు అనుకూలంగా నివేదిక

న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి) :

తెలంగాణపై ఢిల్లీలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ శనివారం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు అనుకూలంగా ఆయన నివేదిక ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్ర పరిస్థితులను అధినేత్రికి వివరించిన డిగ్గీరాజా.. రాష్ట్ర విభజన అంశంపై ప్రత్యేక నివేదిక సమర్పించారు. రాష్ట్ర పర్యటన, ఇరు ప్రాంతాల నేతలతో సంప్రదింపులు, తదితర అంశాలను క్రోడీకరించి రూపొందించిన నివేదికను ఆయన సోనియాకు సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగానే త్వరలో కోర్‌కమిటీ సమావేశమై తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో రాష్ట్ర విభజనపై అధినేత్రికి స్థూలంగా వివరించారు. అలాగే, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, విభజన వల్లే కలిగే లాభనష్టాలు, జగన్‌ ప్రభావం తదితర అంశాలపైనా వివరించినట్లు సమాచారం. సీఎం, డెప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌లు ఇచ్చే రోడ్‌మ్యాప్‌ అనంతరం మరోమారు పరిస్థితులు సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. తెలంగాణ అంశంపై అధినేత్రి దిగ్విజయ్‌కు పలు సూచనలు చేసినట్లు సమాచారం. సోనియాతో భేటీకి ముందు ఆయన రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. పావుగంట పాటు సాగిన ఈ భేటీలో దిగ్విజయ్‌ రాష్ట్ర పరిస్థితులను రాహుల్‌గాంధీకి వివరించినట్లు తెలిసింది. ఓ వైపు తెలంగాణ అంశం, మరోవైపు జగన్‌ ప్రభావం, ఇంకోవైపు ముంచుకొస్తున్న ఎన్నికలు.. క్లిష్ట సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన దిగ్విజయ్‌సింగ్‌ ఇటీవల రాష్ట్రంలో పర్యటించారు. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న, రాష్ట్రంలో అనిశ్చితికి కారణమైన తెలంగాణ అంశంపై ఆయన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. డిసెంబర్‌ 9 నాటి ప్రకటనకు కట్టుబడి ఉన్నామని, రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతుందని వ్యాఖ్యానించారు. రెండు, మూడు వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని, ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దీంతో అటు తెలంగాణ నేతలు, ఇటు సీమాంధ్ర నేతలు దిగ్విజయ్‌ను కలిసి తమ తమ అభిప్రాయాలను వివరిస్తున్నారు. రాష్ట్ర విభజనపై లాబీయింగ్‌ను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్‌ శుక్రవారం ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేను కలిసి రాష్ట్ర పరిస్థితులపై నివేదించారు. అనంతరం జరిగిన కోర్‌ కమిటీ భేటీలో షిండే రాష్ట్రంలోని పరిస్థితులపై వివరించారు. ఈ నేపథ్యంలో సోనియా నుంచి పిలుపు రావడంతో దిగ్విజయ్‌ శనివారం ఉదయం ఆమెతో సమావేశమై సమాలోచనలు జరిపారు. సోనియాతో దిగ్విజయ్‌ భేటీ ముగిసిన అనంతరం రాష్ట్ర మంత్రి సి.రామచంద్రయ్య అధినేత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని విభజించదలిస్తే రాయలసీమ సహా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది.