ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్ లాల్
ఓటరుకార్డుతో ఆధార్ అనుసంధానాన్ని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్ లాల్ ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించిన భన్వర్ లాల్.. ఓటరుకార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 62.71 శాతం ఓటర్లు.. ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్నారని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 29.86 శాతం మాత్రమే పూర్తయినట్లు చెప్పారు. బోగస్ ఓటరుకార్డుల ఏరివేతలో భాగంగా చేపట్టిన కార్యక్రమానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మద్దతు ఇవ్వాలని భన్వర్ లాల్ కోరారు. జీహెచ్ ఎంసీ పరిధిలో వందశాతం ఆధార్ అనుసంధానం పూర్తి చేసేలా హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. ఈ ఉద్యమంలో తమతో కలిసి రావాలని అన్ని మీడియా సంస్థలకు భన్వర్ లాల్ లేఖలు రాశారు. నూటికి నూరు శాతం ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సాధించాలని ఆయన ఆకాంక్షించారు.




