కడప ఉక్కుపై టిడిపివి దొంగదీక్షలు: కన్నా

కడప,జూలై7(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధుల కన్నా ఎక్కువగానే ఇచ్చిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణకు స్థానిక బిజెపి నాయకులు స్థానిక సమస్యలపై శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇష్టం లేదన్నారు. ఉక్కుపరిశ్రమ కోసం దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం రైల్వే కోడూరు బిజెపి నాయకులు గల్లా శ్రీనివాసులు నివాసంలో అల్పాహారం తీసుకొని తరువాత ర్యాలీగా మోటారు బైక్‌లతో మంగంపేట వరకు వెళ్లారు. ఈ క్రమంలో బిజెపి నాయకులు గల్ల శ్రీనివాసులు, చంగల్‌ రాజు శ్రీధర్‌ పాల్గొన్నారు.