పాలమూరు జిల్లా కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఖతమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీ సహా పలు పార్టీల నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మీ అందరి చేరికతో టీఆర్ఎస్ పార్టీకి వంద ఏనుగుల బలం వచ్చిందని, కల్వకుర్తిలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందన్నారు.
జిల్లా నేతలంతా సమిష్టిగా ముందుకు సాగాలని, పార్టీ అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నరని చెప్పారు. ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నరని, దేశంలో ఎక్కడాలేని విధంగా ఆహార భద్రతను అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ సర్కారుదేనని మంత్రి స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారని కేటీఆర్ చెప్పారు.
60 ఏళ్ల దారిద్ర్యం 9 నెలల్లో పోదు.. కొంత సమయం పడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గత పాలకులు తెలంగాణ పట్ల చూపిన నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. తెలంగాణ వెనుకబడ్డ రాష్ర్టం కాదు.. వెనుకపడేయపడ్డ రాష్ర్టమన్నారు. తెలంగాణలో అనేక వనరులు ఉన్నా .. అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరలోనే ఉద్యోగాల జాతర ఉంటదని మంత్రి వెల్లడించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు.
కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఖతం




