Tuesday, 3 November 2026

కశ్మీర్‌లో మిలిటెంట్ల మెరుపుదాడి

3

20 మంది జవాన్ల మృతి

శ్రీనగర్‌, డిసెంబర్‌5 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌ సరిహద్దుల్లో బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్‌లో  భారత సైన్యం – ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. యూరీ సెక్టార్‌లోని 31 సైనిక శిబిరం సమీపంలో జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సైన్యం కూడా ప్రతిఘటించడంతో సమీపంలోని బంకర్‌లోకి చొరబడ్డారు. వారిని బైటికి రప్పించడానికి సైన్యం ప్రయత్నిస్తోంది. జవాన్లపైకి ఒక్కసారిగా కాల్పులు జరపడంతో 20 మంది జవాన్లు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఆరుగురు టెర్రరిస్టులు కూడా మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ మాట్లాడారు. దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామని, బంకర్లో ఉన్న మిగిలినవారిని కూడా ఏరివేస్తామని పారికర్‌ చెప్పారు. బంకర్‌లో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని అధికార్లు వెల్లడించలేకపోతున్నారు. ఉగ్రవాదులు ఉన్న బంకర్‌ను సైన్యం  దిగ్బంధం చేసినట్లు చెప్పారు. ఉగ్రవాదుల వద్ద భారీ ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. జమ్మూలో రెండో విడత ఎన్నికలు డిసెంబర్‌ 9వ తేదీన జరుగనున్న నేపథ్యంలో మిలిటెంట్లు ఈ మారణకాండకు పాల్పడ్డారు. శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాది హతమయ్యాడు. కారులో వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీస్‌ చెక్‌పోస్టు వద్ద ఆపకుండా వేగంగా దాటుకుని వెళ్లిపోతుండటంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఖ్యూరీ ఇస్రా అనే ఉగ్రవాది మృతి చెందాడు. అతను లష్కరే తొయిబాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనలో ఓ ఏకే-47ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షోపియాన్‌ ప్రాంతంలోని ఓ పోలీసుస్టేషన్‌పై మిలిటెంట్లు దాడి చేశారు. పోలీసుస్టేషన్‌పై గ్రనేడ్‌ విసిరి పారిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *