కాంగ్రెస్‌లో కిరణ్‌కుమార్ రీ ఎంట్రీ?
– మాజీ సీఎంతో వరుస భేటీలవుతున్న కాంగ్రెస్ నేతలు
– బుధవారం కిరణ్‌తో భేటీ అయిన సుబ్బిరామిరెడ్డి
– త్వరలోనే కిరణ్ అధిష్టానం పెద్దల్ని కలుస్తారు
– విలేకరులకు వెల్లడించిన సుబ్బిరామిరెడ్డి
అమరావతి, జూన్27(జనం సాక్షి) : ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారా.. 2014 ఎన్నికల తర్వాత సైలెంట్‌గా ఉన్న ఆయన.. తిరిగి సొంతగూటికి వెళ్లబోతున్నారా.. పరిస్థితులు చూస్తుంటే సంకేతాలు అలానే కనిపిస్తున్నాయి. ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తూ కిరణ్‌తో కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస భేటీలు కావడం కూడా ఆసక్తిగా మారింది. బుధవారం టీ.సుబ్బిరామిరెడ్డి మాజీ సీఎంను కలిశారు. తాజా రాజకీయాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్‌లో చేరిక అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కిరణ్‌తో భేటీ తర్వాత సుబ్బిరామిరెడ్డి విూడియాతో మాట్లాడారు. కిరణ్‌కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారని.. త్వరలోనే అధిష్టాన పెద్దల్ని కలుస్తారని చెప్పుకొచ్చారు. మాజీ సీఎంగా ఆయనకు జాతీయ స్థాయిలో సముచిత స్థానం ఉంటుందన్నారు. వేరే రాష్ట్రాల్లో జనరల్ సెక్రటరీ పదవులకు ఆయన అర్హుడని వ్యాఖ్యానించారు. అధిష్టానం సందేశాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చామని సుబ్బిరామిరెడ్డి చెప్పారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ.. కాంగ్రెస్ అధిష్టానం పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. పార్టీ నుంచి దూరమైన నేతల్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే మంగళవారం కూడా కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు కిరణ్‌కుమార్ రెడ్డిని కలిశారు. పార్టీలో చేరాలని ఆహ్వానించగా.. త్వరలోనే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీని కలుస్తానని కిరణ్ చెప్పారట. కాగా బుధవారం కూడా సుబ్బిరామిరెడ్డి కిరణ్‌తో మంతనాలు జరిపారు. పరిస్థితులు అన్ని చూస్తుంటే మాజీ సీఎం కాంగ్రెస్‌లోకి వెళ్లడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.