ఆయన కష్టజీవి, పోరాట యోధుడు
స్మారక కేంద్రం నిర్మిస్తాం
రవీంద్రభారతి వెంకటస్వామి సంస్మరణ సభలో సీఎం కేసీఆర్
హైదరాబాద్,జనవరి21(జనంసాక్షి): దివంగత వెంకటస్వామి శ్రమజీవి, సమరశీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. తెలంగాణను ప్రగాఢంగా కాంక్షించిన వ్యక్తుల్లో కాకా ఒకరని సీఎం అన్నారు. రవీంద్రభారతిలో కాకా సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జీవిత చరమాంకంలో కూడా తెలంగాణ సాకారమైన తర్వాతే తుది శ్వాస విడుస్తానని ధైర్యంగా చెప్పిన వ్యక్తి కాకా అని అన్నారు. కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీ కేంద్రమంత్రి జి.వెంకటస్వామి(కాకా) సంస్మరణ సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం అన్నారు. ఆయన సంస్మరణ కోసం ఓ భవనాన్ని నిర్మించి ఆయన జ్ఞాపకాలను, అనుభవాలను పదిలం చేస్తామన్నారు. ఒక్క విగ్రహం ఏర్పాటుతో ఆయన సేవలను తక్కువ చేయలేమన్నారు. హైదరాబాద్ ల్యాండ్ మార్క్‌లా ఉండే విధంగా వెంకటస్వామి మెమోరియల్ భవన్ నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున ఏటా వెంకటస్వామి జయంతి, వర్థంతిని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కాకాతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కాకాది 65 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం. వెంకటస్వామి ఓ విజ్ఞాన భాండాగారం. నిరుపేదల గుండె బలమై నిలిచిన వ్యక్తి గుడిసెల వెంకటస్వామన అన్నారు. అలుపెరగని పోరాటయోధుడు కాకాను ఎంత స్మరించినా తక్కువే అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎంతోమంది తెలంగాణ నేతల గొప్పతనం మరుగున పడింది. కాకా తెలంగాణ జాతి సంపద. కాకాను స్మరించుకోవడం తెలంగాణ సమాజాన్ని గౌరవించుకోవడమేనని సీఎం పేర్కొన్నారు. కార్మికులకు పెన్షన్ స్కీం తెచ్చిన ఘనత కాకా సొంతం. ఆయన పని చేయడంలో గొప్ప నేర్పరి. జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి కాకా అని సీఎం పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం తిరుగులేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి వెంకటస్వామి అని కొనియాడారు. వెంకటస్వామిని గౌరవించడమంటే తెలంగాణ సమాజాన్ని గౌరవించడమేనన్నారు. హైదరాబాద్ నగరంలో కాకా నిలువెత్తు విగ్రహంను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రభుత్వాన్ని కోరారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కాకా. కార్మికుల పక్షాన పోరాడిన నేత వెంకటస్వామి. కాకా కార్మికుల పక్షపాతి. దళితులు, పేదల కోసం కాకా ఎంతో కృషి చేశారు. కాకా మరణం దళితసోదరులకు తీరని నష్టమని ఆయన పేర్కొన్నారు.అట్టడుగు నుంచి పార్లమెంట్ స్థాయికి ఎదిగిన వ్యక్తి జి. వెంకటస్వామి(కాకా) అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సినీయర్ నాయకులు జైపాల్‌రెడ్డి అన్నారు. కాకా కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం ప్రకటించారు. ప్రజా జీవితమే పాఠశాలగా ఎదిగిన వ్యక్తి కాకా అని అన్నారు. అట్టడుగు నుంచి పార్లమెంట్ స్థాయికి ఎదిగారు. తెలంగాణ వచ్చే వరకు ఆత్మబలంతో జీవించారని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, కాంగ్రెస్ నేతలు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, నారాయణ, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెదేపా నేత మోత్కుపల్లి నర్సింహులు, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ తదితరులు, కాకా తనయులు వివేక్,వినోద్, మాజీమంత్రి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. శాంతసిన్హా స్వాగతోపన్యాసం చేశారు.





