ఇటీవల కురుస్తున్న వర్షాలకు అదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం జలకళను సంతరించుకుంది. అల్పపీడనం కారణంగా ఇటు తెలంగాణా వ్యాప్తంగా, అటు ఎగువ భాగమైన మహారాష్ట్రలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరద నీటిప్రవాహం పెరగడంతో కుంటాల జలపాతం వరవళ్లు తొక్కుతోంది. ఎత్తైన ప్రాంతం నుంచి కిందికి దూకుతున్న నీటి అందాలను తనివితీరా చూసేందుకు కుంటాలకు పర్యాటకులు పరుగులు పెడుతున్నారు. కుంటుంబ సమేతంగా, స్నేహితులు, బంధువులతో వచ్చిన పర్యాటకులతో కుంటాల జలపాతం దగ్గర సందడి నెలకొంటోంది.
అయితే జలపాతం అందాలను తిలకిస్తూ తమను తాము మైమరచిపోయి పర్యాటకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. లోతైన ప్రాంతాలలో వెళ్లిన పలువురు విద్యార్ధులు,యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత పాలకులు తెలంగాణా ప్రాంతంలో ఉన్న కుంటాల జలపాతం అభివృద్దిపై ఏమాత్రం దృష్టి సారించలేదు. దీంతో ఇక్కడ కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఈ జలపాతాన్ని అతి దగ్గర నుంచి తిలకించేవిధంగా వంతెన నిర్మాణం చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
అదిలాబాద్ జిల్లా సరిహద్దులో మహారాష్ట్రలోని సహస్రకుండ్ జలపాతం దగ్గర నిర్మించిన వంతెనతో పర్యాటకులకు అన్ని విధాలా సౌకర్యంగా ఉంది. దీంతో జలపాతం అందాలను అతి దగ్గర నుంచి తిలకించవచ్చు. సహస్రకుండ్ జలపాతం కూడా దట్టమైన అటవీ ప్రాంతంలో పెన్‌గంగా నదిపై ఏర్పడింది. ఇక్కడ కూడా గతంలో కనీస సౌకర్యాలు ఉండేవి కాదు. అయితే మహారాష్ట్ర పర్యాటక శాఖ, నీటి పారుదల శాఖ, అటవీశాఖలు సంయుక్తంగా జలపాతం దగ్గర సకల సౌకర్యాలను కల్పించాయి. జలపాతంకు అడ్డంగా అందమైన ఆకృతిలో వంతెన నిర్మించారు. దూర ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకుల కోసం అతిథీ గృహాలను కూడా నిర్మించారు. ఇదే విధంగా కుంటాల జలపాతాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరముంది.
కుంటాల జలపాతం దగ్గర వంతెన నిర్మించడంతో పాటు కాటేజీలు, రెస్టారెంట్లు, నిర్మిస్తే సంవత్సరం పొడగునా పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. మరోవైపు జలపాతం పై భాగంలోకి వెళ్లేందుకు చాలామంది పర్యాటకులు, యువకులు ప్రయత్నిస్తారు. అటు వైపు వెళ్లకుండా టూరిస్టు గైడ్లను ఏర్పాటు చేసి సందర్శకులను అప్రమత్తం చేయాల్సిన అవసరముంది. జలపాతం చుట్టు ఇనుప కంచెతో ఫెన్సింగ్ వేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
మరోవైపు అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా కుంటాల జలపాతం దగ్గర రక్షణ చర్యలపై దృష్టి సారించారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా పర్యాటకుల రక్షణకోసం ప్రణాళికలు రూపొందిస్తోంది. జిల్లాకు చెందిన మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి నగేశ్, స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా కుంటాల దగ్గర రక్షణ చర్యలపై పర్యాటక శాఖకు, అలాగే సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
మొత్తానికి అటు జిల్లా యంత్రాంగం, ఇటు ప్రజా ప్రతినిధులు కుంటాల జలపాతం దగ్గర కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే కుంటాల జలపాతం మంచి పర్యాటక కేంద్రంగా మారుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




