తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎదురైన తొలి సవాలును సీఎం కేసీఆర్ దార్శనికతతో సమర్థంగా ఎదుర్కొన్నారు. గంట కరెంటు కూడా గగనం అనిపించిన ఉమ్మడి రాష్ట్రపు ఎండాకాలపు అనుభవాలను చరిత్ర పుటల్లోకి నెట్టేసి, ఒక్క నిమిషం కూడా కోతలులేని ఘనతను సాధించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సరఫరా వ్యవస్థను ఆధునీకరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా లక్షా 40వేల విద్యుత్ స్తంభాలను ఏర్పాటుచేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకేసారి 138 నూతన 33/11 కేవీ సబ్స్టేషన్లను ప్రారంభించారు. 440 కిలోమీటర్ల మేర 33 కేవీ విద్యుత్ లైన్, 6024 కిలోమీటర్ల 11 కేవీ విద్యుత్ లైన్, 3909 కిలోమీటర్ల మేర ఎల్టీ లైన్లను ఏడాదికాలంలో ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నిరంతర పర్యవేక్షణతో రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. ఈ ఏడాది కొత్తగా 174 సబ్ స్టేషన్లు, 20 వేల డీటీఆర్సీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసేందుకు, 1700 కిలోమీటర్ల పొడవున 33కేవీ 11కేవీ విద్యుత్ లైన్ల నిర్మాణం చేపట్టేందుకు విద్యుత్ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి మొదటి విడత విడుదల చేసిన 480 కోట్లతో పనులు మొదలు పెట్టారు.
విద్యుత్ రంగంలో ప్రభుత్వ దార్శనికత, చొరవను చూసి అనేక రుణసంస్థలు సహకారం అందించేందుకు ముందుకు వచ్చాయి. భవిష్యత్తులో మిగులు విద్యుత్ దిశగా ఏర్పాటుచేస్తున్న విద్యుత్ ప్రాజెక్టులకోసం ఆర్ఈసీ నుంచి ఇప్పటివరకు 20 వేల931 కోట్లు అందించింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం 4వేల కోట్లను సమకూర్చింది. ప్రతి ఇంటికి విద్యుత్ సప్లయ్ కింద 650 కోట్లు, జాతీయ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను మెరుగుపర్చేందుకు మరో 700 కోట్లు మంజూరు చేశాయి. సౌర విద్యుత్ ఉత్పత్తిలోనూ రాష్ట్రం ముందడుగు వేస్తున్నది. వచ్చే ఖరీఫ్‌నాటికి 3200 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందుబాటులోకి రానుంది.




