తెలంగాణ పర్యాటక శాఖ కృష్ణానదిపై ఫాంటూన్ బోట్‌ను లాంఛనంగా ప్రారంభించింది. పాలమూరు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద ప్రారంభించిన ఈ లాంచ్‌కి సోమశిల లాంఛ్ గా నామకరణం చేశారు. ఆద్యంతం అహ్లాదానిచ్చే ఈ బోట్ జర్నీకి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ రానుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఆకర్షణీయమైన ప్యాకేజీలతో పర్యాటకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది పర్యాటక శాఖ. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి, చందూలాల్, ఎంపీ జితేందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, టీఎస్టీడీసీ ఛైర్మన్ పేర్వారం రాములు పాల్గొన్నారు.
సోమశిల నుంచి శ్రీశైలం వరకు 110 నాటికల్ మైళ్ల దూరం బోట్ జర్నీ సాగుతుంది. దారిపొడవున క్రిష్ణానది అందాలను ఆస్వాదిస్తూ ఈ జర్నీ సాగుతుంది. 6 గంటల పాటు సాగే ఈ ప్రయాణాన్ని పర్యాటకులు తనివితీరా ఆస్వాధించేలా ఓపెన్ టాప్ ఫాంటున్ బోట్ ను 80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. వీవ్ పాయింట్లను , నల్లమల కొండలను, రకరకాల పక్షులను, చారిత్రక ప్రదేశాలను ఫాంటున్ బోట్ ద్వారా వీక్షించే అవకాశం ఉంది. జూన్ 2016 నుంచి ఈ లాంఛ్ ను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
బోటు ఓపెనింగ్‌తో చారిత్రక ప్రదేశాలు పూర్వవైభవం సంతరించుకుంటాయని మంత్రి జూపల్లి అన్నారు. దేశం నలుమూలల నుంచి ప్రజలు సోమశిలకు తరలివస్తారన్నారు. అటు సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు మరుగున పడ్డాయని మరో మంత్రి చందూలాల్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ చొరవతో కృష్ణనదిలో బోటు సౌకర్యం చాలా తొందరగా ఏర్పాటు అయ్యిందన్నారు.
గోదావరిపై పాపికొండల అందాలు పోలవరం ప్రాజెక్టుతో కనుమరుగయ్యే ప్రమాదంలో పడటం వల్ల ఆ లోటును పూరించి క్రిష్ణానదిపై టూరిజంను అభివృద్ది చేసేందుకు పర్యాటకశాఖ కృషి చేస్తోంది. నల్లమల కొండల మధ్యలోంచి సుదూర ప్రయాణం చేస్తున్న క్రిష్ణానదిపై లాంఛీ జర్నీని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పర్యాటక శోభతో తీర్చిదిద్దే ఆశయంతో ముందుకెళ్తుంది.




