హైదరాబాద్, డిసెంబర్ 9 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎంతో చొరవ చూపారని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. సోనియా దార్శనికత వల్లే తెలంగాణ సాధ్యమైందని పేర్కొన్నారు. పార్టీలు ఏవైనా ప్రజా సమస్యలపై నిర్దిష్ట కార్యాచరణ ఉండాలన్నారు. ప్రజా రాజకీయం ఒక్క తెలంగాణలోనే సాధ్యమైందన్నారు. తెలంగాణ నినాదానికి తెరాస వ్యక్తీకరణ ఇచ్చిందన్నారు. తద్వారా లబ్ధిపొందిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన కెసిఆర్ తన ఆర్నెళ్ల పాలన ప్రజానుకూలంగా ఉందని కితాబిచ్చారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు పాలన సాగిస్తున్నారన్నారు. ఎందుకోసమైతే తెలంగాణ సాధించామో ఆ దిశలోనే ఆయన పాలన సాగుతోందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు సుస్థిర పాలన అందించేందుకు కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని ఒక్కటిగా అమలు చేసేందుకు ముందుకుసాగుతన్నారని కోదండరాం చెప్పారు.
కెసిఆర్ ఆర్నెళ్ల పాలన భేష్ : కోదండరాం





