Tuesday, 3 November 2026

సమైక్య పాపం.. తెలంగాణకు శాపం

2

ప్రాజెక్టులు ఆంధ్రాకు.. తుంపర సేద్యం తెలంగాణకు

ప్రాజెక్టులు లేక తెలంగాణలో కరెంటు కష్టాలు

సోలార్‌ పంపుసెట్లు విద్యుత్‌ సమస్యకు ప్రత్యామ్నాయం

ప్రభుత్వ రాయితీ 50 నుంచి 100 శాతానికి పెంచాలి

అప్పుడే కరెంటు కష్టాలకు శాశ్వత పరిష్కారం

పంటలకు కమతాల వారీగా ఇన్స్‌రెన్సూ ఇవ్వాలి

రైతు ఆత్మహత్యలూ ఉండవు

సహజ సంపద తరిగిపోదు

సోలార్‌ పంపుసెట్లపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం…

 

అరవై ఏళ్ల సమైక్య పాలన.. అడుగడుగునా వివక్ష.. కాలువల నీటిపారకం.. ఆంధ్రాకు. తుంపర సేద్యం తెలంగాణకు. అంగుళానికో బోరువేసి బోర్లాపడ్డ తెలంగాణ రైతన్న. ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలో కట్టి తెలంగాణను ఎండబెట్టినరు. తెలంగాణకు నీళ్లంటే.. ‘నీరు – మీరు’ అని నీతులు చెప్పినరు. బొగ్గుమాది.. నీళ్లు మావి. పవర్‌ ప్రాజెక్టులు ఆంధ్రాలో. విధ్వంసమైన తెలంగాణలో ఉన్నపలంగా మార్చడం.. మార్చే మంత్రదండం ఆశించడం.. అత్యాశే. అయినా.. పునర్నిర్మించుకోవాలి. తెలంగాణ సాధించుకున్నది ఆత్మగౌరవంతో కూడిన బంగారు తెలంగాణ కోసమే. కరెంటు కష్టాలు.. రైతుల ఆత్మహత్యలపై ‘జనంసాక్షి’ బాధ్యతాయుతమైన పత్రికగా తనవంతు సూచనలు చేస్తోంది.

 

హైదరాబాద్‌, నవంబర్‌ 29 (జనంసాక్షి) : సౌరశక్తి ఎన్నటికీ తరగని శక్తి..! ఆ శక్తి మానవాళికి మహా వరం..!! దాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తే.. భూమ్మీద లభించే సహజవనరుల అవసరం లేకుండానే కావాల్సినంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు..! పైగా.. ఆ సహజ సంపదనంతా భావితరాలకు దాచవచ్చు..!! సౌర విద్యుత్‌ ఉత్పత్తి వల్ల కరెంటు సమస్యలకు శాశ్వతంగా చెక్‌పెట్టవచ్చు. అంతేకాదు.. రైతు ఆత్మహత్యలకూ పుల్‌స్టాప్‌ పెట్టవచ్చు. సౌర విద్యుత్‌ వల్ల వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహావసరాలకు చాలినంత కరెంటును సరఫరా చేసుకోవచ్చు. ఇలా బహుళ ప్రయోజనాలు కలిగిన సౌరశక్తితో ప్రభుత్వం సౌరవిద్యుత్‌ ఉత్పాదనకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని రైతులందరికీ సోలార్‌ పంపుసెట్లను అందించి.. సౌరవిద్యుత్‌ ఉత్పత్తికి తోడ్పాటునిస్తోంది. అందుకు 50 శాతం సబ్సిడీ కూడా ప్రకటించింది. అయితే.. రైతులకుచ్చే సోలార్‌ పంపుసెట్లపై సబ్సిడీని 50 నుంచి 100 శాతానికి పెంచాలని కోరుతూ.. ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం అందిస్తోంది.

 

ఎన్నటికీ తరగని వనరు సౌరశక్తి…

సౌరశక్తిని ఎంత వాడుకున్నా.. ఎన్నటికీ తరగని వనరు. ఇది మానవాళికి మహా వరంలాంటింది. దీనిని ఉపయోగించి కావాల్సినంత విద్యుత్‌ను ఉపయోగించుకోవచ్చు. తద్వారా.. ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తికి ఉపయోగిస్తున్న బొగ్గు, గ్యాస్‌, ఇతర సహజవనురులను వాడుకోకుండా రైతులకు అవసరమైనంత కరెంటును ఉత్పత్తి చేసుకోవచ్చు. అసలు భూమ్మీద లభ్యమయ్యే సహజ సంపద అవసరమే ఉండదు. పైగా ఈ సహజసంపదను భావితరాలకు దాచిపెట్టవచ్చు. అంతేకాదు.. వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహావసరాలకు నిరంతర కరెంటును సరఫరా చేసుకునేందుకు విద్యుత్‌ కొరత ఉండదు.

 

సౌరవిద్యుత్‌ ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కసరత్తు…

దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ ప్రభుత్వాలు కరెంటు సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆలోచిస్తున్నాయి. అందుకు సౌరవిద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి సారించాయి. ముఖ్యంగా వ్యవసాయానికి కరెంటు కొరతలేకుండా చూడాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే రైతులకు వ్యవసాయ మోటర్లకు విద్యుత్‌ నందించే సోలార్‌పంపుసెట్లను ఇవ్వాలని భావిస్తున్నాయి. దీనికిగాను కేంద్ర ప్రభుత్వం కొన్ని విధివిధానాలను రూపొందించి ఆర్నెళ్ల కిందట కొన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. సౌర విద్యుత్‌ ఉత్పాదన, సోలార్‌పంపుసెట్లతో నడిచే వ్యవసాయ మోటార్ల పనితీరు, దానికి కావాల్సిన ఖర్చుల వివరాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ కమిటీలలో ఎవరెవరు సభ్యులు ఉండాలనే నిబంధనలను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందులో భాగంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కలిపి 3,500 పంపుసెట్లను మంజూరు చేసింది. వీటిని రెండు రాష్ట్రాల్లోని జనాభా ప్రాతిపదికన 52:48 నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

 

సౌరవిద్యుత్‌ ఉత్పత్తిపై అధ్యయన కమిటీ ఏర్పాటు…

తెలంగాణలో.. సౌరశక్తిని ఉపయోగించి సౌరవిద్యుత్‌ ఉత్పాదన, సౌరవిద్యుత్‌తో నడిచే వ్యవసాయ మోటారు పంపుసెట్ల పనితీరు.. దానికయ్యే ఖర్చులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు.. తెలంగాణ ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని గత నెల 21న ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసింది. ప్రభుత్వం రైతుల కరెంటు కష్టాలను తీర్చేందుకు విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి సారించింది. ప్రస్తుతం తెలంగాణలో 20 లక్షల వ్యవసాయ మోటార్‌ పంపుసెట్లు ఉన్నాయి. వాటన్నింటికీ సోలార్‌ పంపుసెట్లను అందించేందుకు ప్రభుత్వం ఈ అధ్యయన కమిటీ ద్వారా వివరాలు సేకరించనుంది. ఈ విషయమై వివిధ సోలార్‌పంపుసెట్ల తయారీ కంపెనీల యజనమానులతో సిఎం కెసిఆర్‌ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన 20 లక్షల పంపుసెట్లను ఒకే సారి అమలు చేయడం కంటే దీన్ని ఒక ఫైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని భావిస్తున్నారు. మొదటగా లక్ష పంపుసెట్లను అందజేసి తద్వారా వచ్చిన అనుభవంతో దశలవారీగా 20 లక్షల పంపుసెట్లకు సోలార్‌ పంపుసెట్లను అందించాలని యోచిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న మోటార్‌ పంపుసెట్లకు రోజుకు 7 గంటలపాటు నిరంతర విద్యుత్‌ సరఫరా చేసేందుకు 30 మిలియన్‌ యూనిట్ల కరెంటు అవసరమవుతోంది. అందుకుగానూ రూ.15 కోట్లు ఖర్చవుతోంది.

 

100 శాతం రాయితీతో సోలార్‌పంపుసెట్లు ఇవ్వాలి…

రైతులకు ఇచ్చే సోలార్‌పంపు సెట్లు భారీ ఖర్చుతో కూడుకున్నవి. ఒక్కో 5 హెచ్‌పి పంపుసెట్‌ ఖర్చు రూ.5 లక్షలు అవుతుంది. కానీ.. ఇంత భారీ వ్యయాన్ని రైతులు భరించే స్థితిలో లేరు. ఈ విషయాన్ని అధికారులు ఇప్పటికే తేల్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో పంపుసెట్‌పై కేంద్ర ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 15 శాతం సబ్సిడీ భరించి మిగిలిన మొత్తాన్ని రైతుల నుంచి వసూలు చేయాలని సూచించింది. అయితే.. రైతులు పంపుసెట్‌ మొత్తం ఖర్చులో కనీసం 15 నుంచి 20 శాతం ఖర్చు కూడా భరించే స్థోమత లేదని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై.. సౌరవిద్యుత్‌ ఉత్పత్తికి చేస్తే ఎంత భారం పడుతుంది..? ప్రస్తుతం సరఫరా చేస్తున్న విద్యుత్‌ వల్ల ఎంత భారం పడుతుంది..? అనే కోణాల్లో అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం రైతులకు ఇచ్చే సోలార్‌ పంపుసెట్లపై ప్రస్తుతం ఇస్తున్న 50 శాతం సబ్సిడీని 100 శాతానికి పెంచితే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దీంతో వ్యవసాయానికి కావాల్సినంత కరెంటును ఉత్పత్తి చేసుకుని రైతులు కరెంటు కష్టాలను అధిగమిస్తారు. ఎక్కువగా లబ్ధిపొందే అవకాశం ఉంటుంది.

 

కరెంటు సమస్యలకు శాశ్వత పరిష్కారం…

ప్రస్తుతం భూమ్మీద లభ్యమయ్యే సహజన వనరులైన బొగ్గు, గ్యాస్‌, నీటితో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వాడుతున్నాం. అయితే.. పెరిగిన అవసరాల రీత్యా ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ ఏమూలకూ సరిపోవడం లేదు. ముఖ్యంగా వ్యవసాయానికి, పరిశ్రమలకు కరెంటు సరఫరాలో తీవ్ర అంతరాయం పెరుగుతోంది. తద్వారా పంటలు ఎండిపోతున్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోతోంది. కరెంటు సమస్యల వల్ల అటు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటు కార్మికులు రోడ్డునపడుతున్నారు. గృహావసరాలకు కూడా సరిపడా కరెంటు సరఫరా కావడం లేదు. దీంతో ఇళ్లల్లో విద్యుత్‌ సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి. పరీక్షల సమయంలో విద్యార్థులకు కరెంటు సమస్యలు వారిజీవితాలతోనే ఆడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. కరెంటు కష్టాలు శాశ్వతంగా పోవాలంటే.. సౌరశక్తిని ఉపయోగించి సౌరవిద్యుత్‌ ఉత్పత్తి అనివార్యం. దీంతో.. వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహావసరాలకు కావాల్సినంత కరెంటును ఉత్పత్తి చేసుకోవచ్చు. తద్వారా పంటలకు, పరిశ్రమలకు నిరాటంకంగా కరెంటు సరఫరా చేసుకోవచ్చు. కోతలను, కొరతను అధిగమించి మిగులు విద్యుత్‌ను సాధించవచ్చు.

 

కమతాల వారీ ఇన్సూరెన్స్‌తో రైతు ఆత్మహత్యలకు చెక్‌…

రైతుల ఆత్మహత్యలను శాశ్వతంగా నివారించేందుకు ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు విపత్తులు వచ్చినప్పుడు కమతాల వారీగా ఇన్సూరెన్స్‌ చెల్లించాలి. ఆ ఇన్స్‌రెన్సూ కోసం చెల్లించాల్సిన ప్రీమియం కూడా ప్రభుత్వమే భరించాలి. అప్పుడే.. ఎన్ని విపత్తులు వచ్చినా రైతులకు ఊరట కలుగుతుంది. కనీసం పెట్టుబడి మందమైనా పరిహారం అందుతుంది. తద్వారా రైతులు అప్పుల్లో కూరుకుపోరు. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయానికి అక్కడి ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. అక్కడి రైతులకు ఆ ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. కమతాల వారీగా పంటలపై రైతులకు ఇన్సూరెన్స్‌ చెల్లిస్తున్నాయి. ఇన్స్‌రెన్సూ ప్రీమియాన్ని కూడా ప్రభుత్వాలే భరిస్తున్నాయి. అదే విధానాన్ని దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు అమలు చేస్తే దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ రైతు ఆత్మహత్యల మాటే ఉండదు.

 

ప్రాజెక్టులు లేక తెలంగాణకు కరెంటు కష్టాలు…

సమైక్య పాలకుల వివక్షకు తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారింది. ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలో కట్టడం వల్ల తెలంగాణలో నీటినిల్వకు అవకాశం లేక కరెంటు ఉత్పత్తి లేదు. బొగ్గు గనులు విరివిగా ఉన్నా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఆంధ్రాలోనే ఉన్నాయి. ఇక్కడి బొగ్గును అక్కడికి తరలించి విద్యుత్‌ ఉత్పత్తి చేసుకుంటున్నారు. నీళ్లు తెలంగావి అయినా ప్రాజెక్టులు లేకపోవడంతో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి తెలంగాణలో లేదు. దీంతో తెలంగాణకు కరెంటు కష్టాలు భారీగా వచ్చిపడ్డాయి. ముఖ్యంగా విద్యుత్‌ కోతలు రైతుల ప్రాణాలు హరిస్తున్నాయి. దీనికంతటికీ సమైక్య పాలకుల పాపాలనే చెప్పుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను, థర్మల్‌ పవర్‌ స్టేషన్లు, ప్రాజెక్టులు స్థాపించి ఉంటే ఈ రోజు తెలంగాణకు కరెంటు కష్టాలు వచ్చేవి కావని యావత్‌ తెలంగాణ ప్రజలు విమర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *