లక్ష నాగళ్లతో ఫిలింసిటీ దున్నుతామన్నారు – టీపీసీసీ పొన్నాల
హైదరాబాద్,జనవరి12(జనంసాక్షి): కేసీఆర్ అబద్ధం చెబుతున్నారనీ, రానున్న ఎన్నికల కోసమే ఓటర్లను ఆకర్షించడానికి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ నగరాలలో పర్యటనలు సాగిస్తున్నారనీ, తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళిత ముఖ్యమంత్రి అంశం నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీ అంశం వరకు ఆయన అబద్దాలు మాట్లాడని అంశమే లేదన్నారు. పైగా తాను అబద్దాలు మాట్లాడడని, మాట తప్పనని, అన్నమాటపై నిలబడే వ్యక్తనని తల తెగిపడ్డా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తల నరుక్కుంటానని అంటున్నారని ఇవన్నీ ఆయన చేసే ఒక అబద్దపు కుట్ర అని తీవ్రంగా మండిపడ్డారు. అబద్దాల గురించి గోబెల్స్‌ను తప్పుల గురించి శిశుపాలుని గురించి మనం మాట్లాడుకుంటామని భవిష్యత్తులో ఈ రెండింటి గురించి మాట్లాడుకోవాలంటే కెసిఆర్‌ను ఉదాహరణగా తీసుకోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. వరంగల్ మురికి వాడల్లో తిరిగి వెంటనే ఇళ్లనిర్మాణాలకు భూమి పూజ చేశారని, ఆసరా పధకం కింద లబ్దిదారులను గుర్తించారని ఈ ఆలోచనలను తాము స్వాగిస్తున్నామని అన్నారు. గతంలో వరంగల్‌లో చేసిన ఔటర్ రింగ్‌రోడ్డు,అండర్ డ్రైనేజ్ పనుల గురించి ఈ సారి ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడో రోజే తన స్వంత నియోజకవర్గం గజ్వెల్‌కు పోయి ఒక్క గజ్వెల్ పట్టణంలోనే 5వేల ఇళ్ళ నిర్మాణాలకు హామి ఇచ్చారని మరి ఆ పనులు ఎంతవరకొచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన దళితుల భూమి, పేదలకు ఇళ్ళు, ఇంటికో ఉద్యోగం ఇలా వందలాది హావిూల సంగతేమయిందని అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మళ్లీ కొత్తగా హవిూలిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 200 రోజుల్లో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కరిని కూడా మందలించిన పాపాన పోలేదని, ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని అన్నారు. ఆసరా కోసం దరఖాస్తులు పెట్టుకునేందుకు వృద్దులు, వికలాంగులు, మహిళల్లో ఎండలో నిలబడి సొమ్మసిల్లి పోయారని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొంతమంది గుండెపోట్లతో మరణించారని ఎవరినైనా విూరు పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. . చేనేత కార్మికులు అప్పులతో అల్లాడిపోతున్నారు, ఒక్క సిరిసిల్లలోనే వారం రోజుల్లో నలుగురు ఆత్మహత్య చేసుకున్నా, వారిపట్ల విూరు కనీసం సానుభూతి చూపలేకపోయారని పొన్నాల అన్నారు. ఎన్నికల ముందు బీడి కార్మికులకు భృతి ఇస్తామన్నారు. వారు ఉద్యమాలు చేసుంటే వారి గురించి మాట్లాడారా, విద్యార్ధులు, యువకులు తెలంగాణ కోసం ఉద్యమాల చేశారు, వారు ఇప్పుడు యూనివర్శిటీలలో, విూ క్యాంపు కార్యాలయం ముందు పోరాటాలు చేస్తుంటే ఒక్కరినైనా పిలిచి మాట్లాడారా అని అడిగారు. మరి ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో సమస్యలపైనే ఎందుకు స్పందిస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలియదా, ఇది విూ ఎన్నికల, ఒట్ల రాజకీయం కాదా ఇదేనా విూ వైఖరి అంటు పొన్నాల తీవ్రస్థాయిలో మండిపడ్డారు .రామోజీ ఫిల్మ్ సిటి వ్యవహారంలోనే కాదు, ప్రతి వ్యవహరంలోను కేసిఆర్ మాట తప్పే మనిషిని ఆయన అన్ని అంశాల వలెనే రామోజీ ఫిల్మ్‌సిటి విషయంలోను అబద్దాలు ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికైనా అబద్దాలతో కాలం గడపకుండా కొత్త తెలంగాణలో ప్రజలకు పనికొచ్చే విషయాలపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టిపిసిసి అధికార ప్రతినిది అద్దంకి దయాకర్, క్రమశిక్షణ సంఘం సభ్యులు బండ ప్రకాశ్, వరంగల్ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి,రంగారెడ్డి డిసిసి అధ్యక్షులు క్యామ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కొత్త సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు భోగి, సంక్రాంతి,కనుమ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య శుభాకంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలలో, అన్ని రంగాలలో మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. మాజీ సి.ఎల్.పి నాయకులు పి.జనార్ధన్ రెడ్డి జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా టిపిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పెజెఆర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ పెజెఆర్ పేద ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి పోరాటం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమాలలో పిజెఆర్ కుమారుడు మాజీ ఎమ్మల్యే విష్ణు వర్ధన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నిరంజన్, కుమార్‌రావు తదితరులు పాల్గొన్నారు.




