జిల్లాల పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రం ఏర్పడగానే పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం కొత్త జిల్లాల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ముఖ్యకార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణకు అవసరమైన సిఫారసులతో నివేదిక ఇవ్వడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ చైర్మన్‌గా కమిటీని ప్రభుత్వం నియమించింది. దీనిలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ సభ్యులుగా, సీసీఎల్ఏ స్పెషల్ కమిషనర్ అధర్‌సిన్హాను కన్వీనర్‌గా నియమించారు. కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్యలతోపాటు నీటిపారుదలశాఖ, రోడ్లు, భవనాల శాఖ, పర్యావరణ శాఖ, హోం శాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు, డీజీపీ, ఆటవీశాఖ ముఖ్యకార్యనిర్వహణాధికారులను నియమించారు. జిల్లాలు, రెవె న్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ఈ కమిటీ సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి.. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పాటుపై ప్రభు త్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్న వెంటనే సీసీఎల్ఏ రంగంలోకి దిగింది. జిల్లాలవారీగా జనాభా, భౌగోళిక పరిస్థితులు, సరిహద్దుతో పాటు జిల్లా, డివిజన్, మండలాల సరిహద్దులు, నియోజకవర్గాల సరిహద్దులతో కూడిన సమాచారాన్ని క్రోడీకరించింది. జిల్లాలు ఏర్పా టు చేస్తే ఏ ప్రాంతం ఏ జిల్లాలో ఉండాలి? ఆ జిల్లాకు ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి? కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాకు ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉండాలి? మండలాలు ఎలా ఉండాలన్న అంశంపై సీసీఎల్ఏ ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 10 జిల్లాలు, 43 రెవెన్యూ డివిజన్లు, 457 మండలాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో ఒక్కో జిల్లాను రెండు, మూడు జిల్లాలుగా విభజించే అవకాశం ఉన్నది. దీంతో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు అదనంగా మరో 14 జిల్లాల వరకు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఒక్కో జిల్లాకు కనీసం మూడు రెవెన్యూ డివిజన్లు అయినా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది. ఈ లెక్కన కొత్తగా మరో 29 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు.




