
జమ్మూ ఎన్నికల సభలో ప్రధాని మోడీ
శ్రీనగర్, డిసెంబర్ 8 (జనంసాక్షి) : గత పాలకుల వల్లే జమ్మూలో ఉగ్రవాద దాడులు తరచూ జరుగుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. బిజెపితోనే ఇక్కడ సుస్థిర ప్రభుత్వం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఆయన సాంబ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీరు నాపై ప్రేమ చూపిస్తే.. అభివృద్ధి రూపంలో వడ్డీతో సహా తిరిగి ఇస్తానని’ మోడీ జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి అన్నారు. బిజెపికి ఓటు వేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మోడీ హామీ ఇచ్చారు. బ్యాలెట్ ద్వారా బుల్లెట్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. వారసత్వ రాజకీయాలకు అంతం పలికే సమయం వచ్చిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కశ్మీర్‌లో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం అన్నదే లేకుండా పోయిందని ఆరోపించారు. అక్కడి పాలకుల వల్లే ఉగ్రవాదం పెరుగుతోందన్నారు. జమ్మూకశ్మీర్‌లో హంగ్ అసెంబ్లీకి అవకాశం ఇవ్వొద్దన్నారు. అభివృద్ధి కావాలంటే బిజెపికి పూర్తి ఆధిక్యం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ వచ్చిన మోడీ అక్కడి నుంచి హెలికాప్టర్లో వేదిక వద్దకు చేరుకున్నారు. జమ్మూకు 25 కిలోమీటర్ల దూరంలోని విజయ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల సభలో మోడీ పాల్గొన్నారు. మోడీ రాక సందర్భంగా అసాధారణ భద్రత ఏర్పాట్లు చేశారు.




