డోన్నకల్,జనంసాక్షి : కురవి మండలం స్టేషన్ గుండ్రాతిమడుగులోనే ఉక్కు పరిశ్రమను నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరినట్లు మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు గుండ్రాతిమడుగులో గతంలో భూముల సర్వే చేపట్టారన్నారు. స్టేషన్ గుండ్రాతిమడుగులో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి బయ్యారం గూడూరు ప్రాంతంలో ఖనిజ సంపదను వినియోగాంచుకోవాలని కోరారు.
సబ్‌ప్లాన్‌తో రాబోయే ఐదేళ్లలో దళిత, గిరిజనులకాలనీల రూపురేఖలు మారిపోయని అన్నారు. ఎస్సీ,ఎస్టీల జనాభా ప్రకారం బడ్జెట్‌లో సుమారు రూ.12వేల కోట్లను కేటాయిస్తారని తెలిపారు. పరిశ్రమల స్ధాపనకు, టాక్సీలను నడుపుకునేవారికి సబ్‌ప్లాన్ నిధుల నుంచి రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. దళిత, గిరిజనుల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ.1000 పింఛన్ ఇవ్వాలని, ఎస్సిలకు సైతం 35 కేజీల బియ్యం అందజేయాలని కోరారు.
రైతులను ఆదుకోవాలి….
ఆకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రెడ్యా డిమాండ్ చేశారు. మామిడి, వరి,మిరప,మొక్కజొన్న, జొన్న పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయని, ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. అకాల వర్ష బాధితులందరినీ ఆదుకోవాలని కోరారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ రాయల బాబూరావు, వైస్ చైర్మన్ గండి రామ్మోహన్,కాంగ్రెస్ నాయకులు గొర్ల సత్తిరెడ్డి, వాంకుడోత్ వీరన్న, ధరంసోత్ కృష్ణ, కేశబోయిన కోటిలింగం, ధరంసోత్ బీక్నానాయక్, రాయల నరేష్, విక్రంబాబు పాల్గోన్నారు.




