పన్నెండేళ్ల పాటు విచారణ.. 24 సార్లు గడువు పొడిగింపు
గుజరాత్ సిఎం చేతికి తుది రిపోర్టు
గాంధీనగర్, నవంబర్ 18 (జనంసాక్షి) : గుజరాత్ -2002 అల్లర్లపై జస్టిస్ నానావతి కమిషన్ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌కు తుది నివేదికను సమర్పించింది. అందులో రెండు వేలకు పైగా పుటలు ఉన్నాయని జస్టిస్ జీటీ నానావతి పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. అందులోని అంశాలను వెల్లడించేందుకు నిరాకరించారు. కమిషన్ ఛైర్మన్ అయిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నానావతి, సభ్యుడైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అక్షయ్ మెహతా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఆమెకు నివేదిక అందజేశారు. గుజరాత్ అల్లర్లపై కమిషన్ 12 ఏళ్లకు పైగా విచారణ జరిపింది. 2002 మార్చి 3న రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన విచారణ గడువును ఇప్పటి వరకు 24 సార్లు పొడిగించారు. 2002 ఫిబ్రవరి 27న జరిగిన గోద్రా రైలు దుర్ఘటనకు సంబంధించి విచారణలో తాను గుర్తించిన అంశాలతో 2008లో కమిషన్ ఒక నివేదికను సమర్పించింది.





