Tuesday, 3 November 2026

గులాబీకార్య‌క‌ర్త‌లకు కేసీఆర్ దిశానిర్దేశం

6scopizyహైదరాబాద్: టీఆర్ఎస్‌ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. 10 జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలతో పరేడ్‌ గ్రౌండ్… గులాబీవనంగా మారిపోయింది. గులాబీపూలలా తరలివచ్చిన కార్యకర్తలు.. ధూంధాం పాటలకు చిందేశారు.
ఆసక్తికరంగా కెసిఆర్ ప్రసంగం
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి బహిరంగసభలో కెసిఆర్ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. పరేడ్ గ్రౌండ్ వేదికగా టీఆర్ఎస్ కార్యకర్తల్లో నూతనోత్సహం కలిగించారు. గులాబీ సైనికులకు దిశానిర్దేశం చేశారు. జల దృశ్యం నుంచి తెలంగాణలో పాలన వరకు జరిగిన విషయాల్ని కేసీఆర్‌ ప్రస్తావించారు. 14 ఏళ్ల ఉద్యమ చరిత్రను, పోరాట జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ… అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధించాలని పిలుపునిచ్చారు.
మార్చి నుంచి రైతులకు 9 గంటల విద్యుత్‌
మార్చి నుంచి రైతులకు 9 గంటల విద్యుత్‌ ఇస్తామని కల్వకుంట్ల స్పష్టం చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను కూడా వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామన్నారు. ఈ ఏడాదిలోనే పేదలకు డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తామని గులాబీదళపతి హామీ ఇచ్చారు. త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు.
చంద్రబాబుపై కేసీఆర్‌ ఫైర్
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసీఆర్‌ విరుచుకుపడ్డారు. కిరికిరి నాయుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన పని సక్కగా చేయలేక… మన మీద పడుతున్నాడంటూ సెటైర్లు విసిరారు. ఏపీలో రైతుల్ని, మహిళల్ని బాబు మోసం చేశారంటూ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. తెలంగాణ తమ్ముళ్లను సైతం గులాబీదళపతి వదల్లేదు. మహబూబ్‌నగర్‌లో పాములాట పెట్టారంటూ తనదైన శైలిలో మాట్లాడారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు కేసీఆర్‌. అడ్డగోలుగా అవాకులు, చెవాకులు మాట్లాడొద్దని ప్రతిపక్షాలకు సూచించారు.
హరీష్‌రావు పేరును ప్రత్యేకంగా ప్రస్తావించిన సీఎం
ఇక ప్లీనరీలో హరీష్‌రావు పాత్రపై కొంత డ్యామేజ్‌ జరగడంతో… ఈ సభలో దాన్ని కవర్‌ చేసుకునే ప్రయత్నం చేశారు కల్వకుంట్ల. హరీష్‌ ముందుగా రావడంతో పాటు… ఆయన్ను ముందువరసలో కూర్చోబెట్టడం… సీఎం తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించడం కూడా జరిగింది. మొత్తానికి క్యాడర్‌కు బూస్ట్ ఇచ్చేందుకు గులాబీబాస్ ప్రయత్నించారు. ఇదే జోష్‌తో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామన్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *