Tuesday, 3 November 2026

గ్రేటర్‌ మాదే

C

– ఐదేళ్లు అవకాశం ఇవ్వండి

– 50 ఏళ్ల అభివృద్ధి చేసి చూపిస్తాం

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,జనవరి9(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌  ఎన్నికల్లో వంద సీట్లు సాధించి, బల్దియా పీఠం కైవసం చేసుకుంటామని తెలంగాణ పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్‌  హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే క్రమంలో తీసుకుంటున్న చర్యలే ఇందుకు దోహదపడతాయని అన్నారు. పాజిటివ్‌ దృక్పథంతో తాము ప్రచారం చేస్తామని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. బల్దియా పోరులో గెలుపు గుర్రాల వడపోత త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. టిఆర్‌ఎస్‌  18 నెలల పాలనే గీటురాయిగా ప్రజల్లోకి వెళ్తామని, మహిళలకు సమాన అవకాశాలుండాలనే 50శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు పేర్కొన్నారు. తనకు, హరీశ్‌రావుకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని  కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇద్దరం రాజకీయంగా ఎదుగుతున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ ఏ బాధ్యత అప్పగించినా దానిని సాధిస్తామని కేటీఆర్‌ తెలిపారు. హరీష్‌రావుతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందన్న కేటీఆర్‌, వీలును బట్టి గ్రేటర్‌లో ముఖ్యమంత్రి ప్రచార సభలు ఉంటాయని వివరించారు. ఐదేళ్లు హైదరాబాద్‌ను అప్పగిస్తే 50ఏళ్ల అభివృద్ధి చేసి చూపిస్తామని హావిూ ఇచ్చారు. కెసిఆర్‌ బహిరంగ సభల ద్వారానే ఎక్కువగా ప్రచారం చేసే అవకాశం ఉందన్నారు. అలాగే ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్‌ ద్వారా ప్రచారం చేస్తారని అన్నారు. సెటిలర్స్‌లో టీఆర్‌ఎస్‌ పట్ల ఆదరణ పెరిగిందని చెప్పారు. భీమవరం నుంచి పోటీచేస్తానని సరదాగానే వ్యాఖ్యానించానని అన్నారు. ఆంధప్రదేశ్‌లో కూడా  కేసీఆర్‌కు  ఆదరణ ఉందని ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తు చేశారు. వారంరోజుల్లో గ్రేటర్‌ మేనిఫెస్టో విడుదల చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. గ్రేటర్‌ ఫలితాల తర్వాతే మేయర్‌ అభ్యర్థిని నిర్ణయిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. ఇదిఅలావుంటే గ్రేటర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో నగర మేయర్‌ పదవిపై అధికార టీఆర్‌ఎస్‌లో  జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. మేయర్‌ రేసులో సీనియర్‌ నేతలతో పాటు కొందరు కొత్త నేతల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ మాత్రం ఎన్నికల అనంతరమే మేయర్‌ అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను రెండు రోజుల్లో విడుదల చేయడానికి టీఆర్‌ఎస్‌ కసరత్తులు చేస్తోంది. తొలి జాబితాను 45 మంది అభ్యర్థులతో ప్రకటించనున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌ అభివృద్దికి కలసి నడుద్దాం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తే ఏదో జరుగుతుందని,హైదరాబాద్‌అల్లకల్లోలం అవుతుందని ఆనాడు లేనిపోని అపోహలు సృష్టించారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. అయితే ఏడాదిన్నరగా ఒక్క చిన్న ఘటన అయినా జరిగిందా అని ప్రశ్నించారు. శనివారం విూర్‌పేటలో ఏర్పాటు చేసిన చేసిన ప్రైవేట్‌ స్కూళ్ల మహాసభలో  ఆయన పాల్గొని ప్రసంగించారు. విడిపోయిన తర్వాత హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లకు ఏమైనా కష్టం కలిగిందా? అని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. అందుకే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. విడిపోవడం వల్లే ఏపీలో ఇవాళ అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. విభజన జరగకుంటే ఏపీలో అమరావతి వంటి గొప్ప నగరం నిర్మాణం జరిగేదా, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐఐఎం, ఐఐటీలు వచ్చేవా? అని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ది కొనసాగుతుందని వివరించారు.  షబ్బీర్‌ ఆలీ వంటి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడటంపై మండిపడ్డారు. వాళ్లు 60 ఏళ్లు పాలన చేసి వదిలి వెళ్లిన దరిద్రాన్ని 18 నెలల్లో తొలగించాలనడం ఎంత వరకు సబబన్నారు. కాంగ్రెస్‌ హయాంలో కరెంట్‌ కోతలు అనేవి పరిపాటిగా ఉండేవని గుర్తు చేశారు. కానీ ఇవాళ సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ వెలిగిపోతోందని తెలిపారు. ఆనాడు సీఎం కిరణ్‌కుమార్‌ కట్టెపట్టుకుని రాష్ట్రం విడిపోతే కరెంటు ఉండదని తెలంగాణ అంధాకారంలో ఉంటుందని లేనిపోని అపోహలు సృష్టించారని అన్నారు. కానీ ఇవాళ ఆయన రాజకీయ జీవితమే అంధాకారమైందని విమర్శించారు.

ప్రజాసమస్యలు తెలిసిన వ్యక్తి కెసిఆర్‌

ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. మనమందరం ఆయన అడుగు జాడల్లో నడిచి బంగారు తెలంగాణను సాధించుకుందామని పిలుపునిచ్చారు.  ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని సీఎం నెరవేరుస్తున్నారని తెలిపారు. ప్రజలు ఏం ఆశించి అధికారం అప్పగించారో ఆమేరకు పనిచేస్తున్నారని వివరించారు. ఆనాడు రాష్ట్రం విడిపోతే ఏదో జరిగిపోతుందని భయపెట్టారని గుర్తు చేశారు. కానీ ఇవాళ హైదరాబాద్‌ అభివృద్ధి పథంలో సాగిపోతోందని తెలిపారు. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీరుతున్నాయని వివరించారు.

హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అని అన్నారు. భవిష్యత్‌లో విదేశీయులెవరైనా భారత్‌ సందర్శనకు వచ్చి తాజ్‌మహల్‌ను చూసిన తర్వాత హైదరాబాద్‌ను కూడా చూసి పోవాలనే రీతిలో తీర్చి దిద్దుతామన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తోన్న సీఎం కేసీఆర్‌ బాటలో మనమందరం నడుద్దామన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించి నగరాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *