Monday, 2 November 2026

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4,538 డ‌బుల్ బెడ్‌రూమ్స్‌

double-bedroom391.38 కోట్లతో జీహెచ్ఎంసీ టెండర్ల ఆహ్వానం

పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లో త్వరలోనే రెండోదశ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టనున్నారు. ఇండ్ల నిర్మాణానికి నగరంలో పదకొండు ప్రాంతాలను గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4,538 డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తారు. దీనికోసం 391.38 కోట్లతో జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించింది.

రెండోవిడత ఇండ్ల నిర్మాణంలో భాగంగా సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిలక‌ల‌గూడ దోబిఘాట్‌లో 9 అంత‌స్తుల బిల్డింగ్ నిర్మిస్తారు. దీనిలో 216 డ‌బుల్ బెడ్‌రూంలు ఉంటాయి. ఇక స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని జి.వై.రెడ్డి కాంపౌండ్‌ లో 9 అంత‌స్తుల‌లో 180 గృహాలు, గోషామహల్ నియోజ‌క‌వ‌ర్గం క‌ట్టెలమండిలో 3 అంత‌స్తుల్లో 128గృహాలు నిర్మిస్తారు. అటు స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌ర్గంలోని హ‌మాలీ బ‌స్తీలో 9 అంత‌స్తుల్లో 360 గృహాలు, బండ మైస‌మ్మ‌న‌గ‌ర్‌లో 9 అంత‌స్తుల్లో 540 గృహాలు, కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గంలోని జియాగూడ‌లో 9 అంత‌స్తుల్లో 1836 గృహాలు, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం లంబాడి తండాలో 9 అంత‌స్తుల్లో 126గృహాలు ఉంటాయి. ఇక మ‌ల‌క్‌పేట్ నియోజ‌క‌వ‌ర్గం పిల్లి గుడిసెల్లో 9 అంత‌స్తుల్లో 324 గృహాలు, ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ఎరుక‌ల నాంచార‌మ్మ బ‌స్తీలో 9 అంత‌స్తుల్లో 432 గృహాలు నిర్మిస్తారు. కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం చిత్తార‌మ్మ బ‌స్తీలో 9అంత‌స్తుల్లో 108 గృహాలు, చాంద్రాయ‌ణ‌గుట్ట నియోజ‌క‌వ‌ర్గం జంగంమెట్ లో 9 అంత‌స్తుల్లో 228 గృహాలను నిర్మించనున్నారు. ఈ గృహసముదాయాల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ జీహెచ్ఎంసీ నోటిఫికేషన్ జారీ చేసింది. టెండ‌ర్ల దాఖ‌ల‌కు సెప్టెంబ‌ర్ 28వ తేదీ తుది గ‌డువుగా నిర్ణ‌యించారు.

కాగా గ‌త నెల 27వ తేదీన న‌గ‌రంలోని నాలుగు ప్రాంతాల్లో రూ.34.72 కోట్ల వ్యయంతో నిర్మించనున్న‌ 448 డ‌బుల్ బెడ్‌రూంల నిర్మాణానికి టెండ‌ర్ల‌ను ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *