చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలే
– ప్రభుత్వాలు జలగల్లా ప్రజల రక్తాన్ని తాగుతున్నాయి
– నోట్లరద్దుపై బాబు చేసిన వాఖ్యాలకు నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు
– విలేకరుల సమావేశంలో వైసీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు
విజయవాడ, సెప్టెంబర్4(జనం సాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడుతున్నారని, ఆయన నోటిని ఫినాయిల్‌తో కడిగినా శుభ్రం కాదని వైసీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. బాబు పెద్ద నోట్ల రద్దుపై చేసిన వ్యాఖ్యలకు నవ్వాలో లేక ఏడవాలో అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. మంగళవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు సలహా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తానే ఇచ్చానని చంద్రబాబు చెప్పిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు.. పూటకో మాట, రోజుకో అబద్ధం ఆడటం బాబు నైజమని ధ్వజమెత్తారు. నోట్ల రద్దు సలహా కమిటీ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబుకు అప్పుడు నోట్లరద్దు తప్పు అని తెలియలేదా అని సూటిగా ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి అంటున్నావు. విూరు చేసిన పాపం కాదా, బీజేపీతో అంటకాగి ఇప్పుడు గగ్గోలు పెడితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జలగల్లా ప్రజల రక్తం తాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వాలు దోపిడీ దొంగల్లా దోచుకుంటున్నాయని, పెట్రోలు, డీజిల్‌లో వస్తున్న డబ్బు అంతా ఏమైపోతుందని ప్రశ్నించారు. ధరలు పెరిగితే తగ్గిస్తానన్నావ్ కదా చంద్రబాబు..
ఇప్పుడు ఎందుకు నోరుమెదపవు అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నోటిని ఫినాయిల్‌తో కడిగినా సరిపోదని తీవ్రంగా దుయ్యబట్టారు. లోకేష్ టాక్స్‌ల రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ధరలు పెంచడంలో నెంబర్ వన్ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఉపన్యాసాలు ఆపి ధరలు నియంత్రించాలని హితవు పలికారు. అనవసర, అసత్య ఆరోపణలు చేస్తోన్న వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. పెంచిన ధరలు తగ్గించకపోతే ప్రజా ఉద్యమాలతో మెడలతో వంచుతామని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.