శ్రీశక్తి పీఠంపై శివనాగేంద్ర సమేతుడై కొలువైన ఖైరతాబాద్ మహా గణపయ్య నిమజ్జనం అత్యంత వైభవంగా సాగింది. చరిత్రకు భిన్నంగా ఈసారి తెలంగాణ సర్కారు ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనాన్ని అనుకున్న సమయానికి అత్యంత ఘనంగా పూర్తి చేసింది. గతేడాది ఒక్క రోజు ఆలస్యమైన కారణంగా ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. జీహెచ్ఎంసీ, పోలీసు అధికారుల సమన్వయానికి.. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సహకారం తోడైంది. దీంతో నిన్న అర్ధరాత్రి నుంచే దర్శనాన్ని నిలిపేసి నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభించారు. తెల్లవారుఝామునే పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు.
ఓ వైపు భారీ వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దైనా..నిర్విఘ్నంగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగాయి. పూజా కార్యక్రమాల అనంతరం వెల్డింగ్ పనులు పూర్తి చేసి మహాగణపతిని ట్రాలీ పైకి తరలించారు. ఉదయం ఎనిమిది గంటలకే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది.
ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దారి పొడవున గణనాథుడికి భక్తితో వీడ్కోలు పలికారు. కోలాటాలు, నృత్యాలతో శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. మహా గణపతిని చూసేందుకు భక్త జనం తండోపతండాలుగా హుస్సేన్ సాగర్ కు తరలివచ్చారు. గణపతి బప్పా మోరియా అంటూ గణనాథుడి నామస్మరణతో ట్యాంక్ బండ్ పరిసరాలు ప్రతిధ్వనించాయి.
పోలీసులు సూచించిన రూట్ మ్యాప్ ప్రకారం రాజ్ ధూత్ హోటల్, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లుంబినీ పార్క్ గుండా శోభాయాత్ర సాగింది. మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఖైరతాబాద్ మహాగణపతి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల జయజయ ధ్వానాలతో ట్యాంక్ బండ్ హోరెత్తింది.
ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న శ్రీ శక్తి పీఠ శివనాగేంద్ర గణపతికి చివరి పూజలు ఘనంగా నిర్వహించారు. శంఖం పూరించి మంగళ హారతులిచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం వెల్డింగ్ పనులు పూర్తి చేసి భారీ క్రేన్ సహాయంతో మహాగణపతిని నిమజ్జనం చేశారు. పదకొండు రోజులు ఘనంగా పూజలందుకున్న ఖైరతాబాద్ గణేషుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు.




