Monday, 2 November 2026

చలో అసెంబ్లీ..తమ్మినేని అరెస్టు..

k5vmoobflహైదరాబాద్ : నిర్భందాలు..పోలీసుల మోహరింపు..ఎక్కడికక్కడ అరెస్టులు..అయినా వామపక్ష నేతలు..ప్రజా సంఘాల నేతలు చలో అసెంబ్లీకి బయలుదేరారు. ఎస్వీకేను పూర్తిగా దిగ్భందనం చేసిన ఖాకీలు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. తమ నాయకులను అరెస్టు కానీయకుండా వామపక్ష కార్యకర్తలు ప్రయత్నించారు. కానీ పోలీసులు నిరంకుశంగా వ్యవహరించారు. కార్యకర్తలను చెదరగొట్టారు. పట్టుకుని ఈడ్చారు. చివరకు తమ్మినేని, చాడ వెంకట్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ ఎన్ కౌంటర్ ఘటనకు నిరసనగా టీడీఎఫ్ ఆధ్వర్యంలో నేడు చలో హైదరాబాద్ పిలుపునిచ్చింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ అరెస్టులకు తెరలేపారు. ఉదయం 11గంటలకు ర్యాలీ ప్రారంభమౌతుందని టీడీఎఫ్ ప్రకటించడంతో పోలీసులు భారీగా ఎస్వీకే వద్ద మోహరించారు. బారికేడ్లు..ముళ్లకంచెలు ఏర్పాటు చేసి రోడ్డును దిగ్భందించారు. ఆ ప్రాంతం గుండా ఎవరినీ వెళ్లనీయలేదు. దీనితో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎస్వీకేలో ఉన్న వామపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలు కరెక్టుగా పదకొండు గంటలకు బయటకు వచ్చారు. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పోలీసుల చర్యను..ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేతలు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల జులుం నశించాలి అనే నినాదాలు ఆ ప్రాంతంలో మారుమోగాయి. నేతల చుట్టూ కార్యకర్తలు వలయంగా ఏర్పడ్డారు. భారీగా మోహరించిన పోలీసులు ఒక్కో కార్యకర్తను లాగి పడేశారు. రోడ్లపై ఈడ్చుకుంటూ వ్యాన్ లలో పడేశారు. మహిళలని చూడలేదు. దీనితో పలువురు కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. చివరకు సీపీఎం, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వంపై విరుచకపడ్డారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని తమ్మినేని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *