హైదరాబాద్ : వ్యవసాయం అభివృద్ధి చెందింది తమ ప్రభుత్వ హాయాంలోనేనని కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. రైతు ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. 25 కోట్ల ఆహార ధాన్యాలు..14 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. ఇందులో కాంగ్రెస్ కృషి ఉందని గమనించాలని, 2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి 1956లో 16 లక్షల టన్నులుంటే 2004లో 57 లక్షల టన్నులకు చేరిందన్నారు. 2014 సంవత్సరంలో 107 టన్నులకు చేరిందని సభకు తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 66 లక్షల టన్నులకు పడిపోయిందన్నారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి పంట రుణాలు 9 శాతం నుండి 4 శాతానికి తగ్గించడం జరిగిందన్నారు. 2004 -2014 వరకు రైతులకు బ్యాంకు రుణాలు అందించినట్లు, 8 జిల్లాల్లో వడ్డీ మాఫీ చేయడం జరిగిందన్నారు. క్వింటాళు వరికి రూ.100 మద్దతు ధర పెంచిందని, దానిని 800 వందల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ప్రస్తుతం కనీస మద్దతు ధర కేవలం రూ. 50కి పెంచడం జరిగిందన్నారు. లక్ష పశువులను రైతులకు ఇచ్చామని, 2004లో పంట రుణాలు 3500 కోట్లు ఉంటే తెలంగాణలో 2014 వరకు రూ. 25వేల కోట్లకు చేరిందన్నారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఎవరూ పరామర్శించలేదని విమర్శించారు.
వ్యవసాయం అభివృద్ధి చెందింది మా హాయాంలోనే’..




