Tuesday, 3 November 2026

చలో హెచ్‌సీయూ విజయవంతం

C

– అడుగడుగునా నిర్భంధం

– విద్యార్థులదే విజయం

– కేంద్రమంత్రులు రాజీనామా చేయాలి

– అంబేడ్కర్‌ మనవడు ప్రకాష్‌

హైదరాబాద్‌,జనవరి25(జనంసాక్షి): రోహిత్‌ ఆత్మహత్యపై హెచ్‌సీయూ రగులుతూనే ఉంది. విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. మరోపక్క వర్సిటీ వీసీ సెలవుపై వెళ్లారు. బాధ్యతలు ఇన్‌ఛార్జి వీసీకి అప్పగించారు. ఇక హెచ్‌సీయూలో రాజకీయ నాయకుల పరామర్శలు ఆదివారం కూడా కొనసాగాయి.

రోహిత్‌ ఆత్మహత్యపై నిరసనలు

హైద్రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యపై నిరసనలు కొనసాగుతున్నాయి. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్టూడెంట్స్‌ చేస్తున్న ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

సెలవులో హెచ్‌సీయూ వీసీ

ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వర్సిటీలో వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ అప్పారావు లీవ్‌ లో వెళ్లారు. ఇన్‌ఛార్జ్‌ వీసీగా ప్రొఫెసర్‌ వి శ్రీవాత్సవ్‌ను నియమించారు. ఐతే ఇన్ఛార్జ్‌ వీసీగా శ్రీవాత్సవ్‌ ను నియమించడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుబట్టాయి. గతంలోనూ ఓ విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి ఆయనపై అభియోగాలున్నాయని స్టూడెంట్స్‌ యూనియన్లు ఆరోపిస్తున్నాయి.

విద్యార్థుల ఉద్యమానికి మద్దతు

మరోపక్క యూనివర్శిటీలో రాజకీయ నాయకులు పరామర్శలు కొనసాగుతున్నాయి. ఆదివారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున్‌ ఖర్గే, జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సెంట్రల్‌ యూనివర్సిటీని సందర్శించి.. విద్యార్థులకు తమ మద్దతు కొనసాగుతోందని స్పష్టం చేశారు. రోహిత్‌ తల్లి రాధికను నేతలు పరామర్శించారు.

మద్దతుగా రిలే దీక్షలు

రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రోహిత్‌ సంఘీభావ పోరాట కమిటీ ఆద్శర్వంలో ఇందిరాపార్కు దగ్గర రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. పలు కార్మిక సంఘాల నేతలు, అధ్యాపకులు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. ట్యాంక్‌ బండ్‌ దగ్గర రోహిత్‌ సంఘీభావ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. పలు ప్రజా సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రోహిత్‌ ఆత్మహత్యపై తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.

ఏపీలోనూ ఆందోళనలు

రోహిత్‌ ఆత్మహత్యకు నిరసనగా ఏపీలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలో పాదయాత్ర చేపట్టారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

‘రోహిత్‌ మృతి..న్యాయం కోసం పోరాడుతాం’..

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ మృతికి వీసీ, కేంద్రమంత్రులిద్దరూ బాధ్యత వహించాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ డిమాండ్‌ చేశారు. హెచ్‌సీయూలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా వర్శిటీకి వచ్చిన ఆయన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీసీ, ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్‌పై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *