చాకో చిల్లర మాటలు

యూపీఏ ఎజెండాలో తెలంగాణ లేదట!
కళంకిత మంత్రులు స్వచ్ఛందంగా వైదొలగాలి
కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి చాకో
న్యూఢిల్లీ, మే 18 (జనంసాక్షి) :
తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ మరోసారి విషం చిమ్మింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలంగాణపై చిల్లర మాటలు మాట్లాడారు. యూపీఏ ఎజెండా (ఐక్య ప్రణాళిక)లో తెలంగాణ అంశం లేనే లేదని చెప్పాడు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యూపీఏ తెలంగాణపై అనుసరిస్తున్న వైఖరిని తేటతెల్లం చేశాడు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు చెప్పుకుంటున్నట్లు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విషయాన్ని బహిర్గతం చేయచూశాడు. యూపీఏ జాతీయ ఎజెండాలో తెలంగాణ అంశాన్ని చేర్చలేదంటూ కుండబద్దలు కొట్టారు. చాకో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోని తెలంగాణ ప్రాంత నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. తెలంగాణవాదులు, ఉద్యమ సంఘాలు చాకోపై, యూపీఏపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణ సమస్యకు యూపీఏ పరిష్కారం చూపలేదంటూ ప్రచారం చేయడం సరికాదని, జాతీయ స్థాయిలో అనేక సమస్యలు పరిష్కారం కాలేదంటూ మాట మార్చే ప్రయత్నం చేశాడు. పీసీ చాకో వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీ అసలు రంగు బయటపడిందని తెలంగాణవాదులు మండి పడుతున్నారు. 2004లో అధికారాన్ని చేజిక్కించుకున్న యూపీఏ-1 ఉమ్మడి ప్రణాళికలో ఉన్న తెలంగాణ అంశం ఇప్పుడెందుకు లేకుండా పోయిందని నిలదీశారు. 2004 ఎన్నికలకు ముందు సోనియాగాంధీ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొని ప్రచారం చేసిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ ప్రకటించి, రాష్ట్రపతి ప్రసంగంలోనూ చేర్చిన విషయాన్ని విస్మరించి చాకో బాధ్యతా రహిత వ్యాఖ్యలు చేశారని మండి పడుతున్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ అడ్డగోలు వాదనలతో గందగోళం సృష్టించాలని ప్రయత్నిస్తోందని, ఆ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పి తీరుతామని హెచ్చరించారు.
కళంకితులు తప్పుకోవాలి
తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో శనివారం సాయంత్రం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రిమండలి ఉన్న కళంకితులు స్వచ్ఛందంగా తప్పుకుంటే మంచిదని హితవు చెప్పారు. జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కేంద్రం తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కళంకిత మంత్రులు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న మంత్రులు పదవులు వదులుకోవాలన్నారు.