Tuesday, 3 November 2026

చిరకాల స్వప్నం సాకారం

C

– జాతీయ ఉత్తమ చిత్రంగా బహుబళి

– ఉత్తమనటుడిగా అమితాబ్‌

– ఉత్తమ నటుడిగా అమితాబ్‌..నటిగా కంగనా రౌత్‌

– దర్శకుడిగా సంజయ్‌ లీలా బన్సాలీ

న్యూఢిల్లీ,మార్చి28(జనంసాక్షి):  63వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ జాతీయ ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది. పురస్కారాల జాబితాను జ్యూరీ సభ్యులు సోమవారం ఉదయం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి అందజేశారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కంచె ఎంపికయ్యింది. తెలుగువాడి సత్తాకు నిదర్శనంగా నిలిచిన బాహుబలికి ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కడం విశేషం. ఇకపోతే  ఉత్తమ నటుడుగా పీకూ చిత్రానికి గాను : అమితాబ్‌బచ్చన్‌ ఎంపికయ్యారు.  ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌( తనూ వెడ్స్‌ మనూ రిటర్న్స్‌), ఉత్తమ దర్శకుడు: సంజయ్‌లీలా బన్సాలీ(బాజీరావ్‌ మస్తానీ) ఎంపికయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి రెండున్నర సంవత్సరాల పాటు శ్రమించి బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం దాదాపు రూ.600 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. బాహుబలి కోసం వివిధ దేశాలకు చెందిన 600 మంది సాంకేతిక నిపుణులు శ్రమించారు. ఎక్కడా గ్రాఫిక్స్‌ అన్న అనుమానం రాకుండా ఉన్నత విలువలతో బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించారు. బాహుబలికి అవార్డుల పంట పండటంతో రాజమౌళి రూపొందిస్తున్న ‘బాహుబలి-2’ పై అంచనాలు రెట్టింపయ్యాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రాజమౌళి అందించిన అద్భుత దృశ్య కావ్యంగా బాహుబలి ఖ్యాతి గడించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్రం అవార్డుతో పాటు ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్టులకు కూడా అవార్డు గెలుచుకున్న బాహుబలి చిత్రయూనిట్‌ను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందించారు. ఇలాంటి అరుదైన పురస్కారాన్ని పొందడం తెలుగు సినీ పరిశ్రమకే గర్వకారణం, గౌరవం అని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగేలా మరిన్ని నాణ్యమైన సినిమాలను తెలుగు సినీ పరిశ్రమ నిర్మిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. బాహుబలి చిత్ర దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు అందరికీ

ఆయన అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *