Tuesday, 3 November 2026

చివరిదశ పోలింగ్‌ ప్రశాంతం

3
జమ్మూలో 65 శాతం, ఝార్ఖండ్‌లో 70.4 శాతం

ఝార్ఖండ్‌లో భాజపా, జమ్మూకాశ్మీర్‌లో హంగ్‌

ఎగ్జిట్‌ పోల్‌ అంచనా

శ్రీనగర్‌, ఝార్ఖండ్‌, డిిసెంబర్‌20(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌, ఝార్ఖండ్‌లలో శనివారం నిర్వహించిన చివరి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జమ్మూకశ్మీర్‌లోని కతువా, రాజౌరీ, జమ్మూ జిల్లాల్లోని 20 నియోజకవర్గాలలో పోలింగ్‌ పూర్తయింది. 65 శాతం పైగా పోలింగ్‌ నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. ఝార్ఖండ్‌లో తుదిదశ ఎన్నికల పోలింగ్‌ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. 16 నియోజకవర్గాల్లో నిర్వహించిన పోలింగ్‌లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయిదో దశలో ఝార్ఖండ్‌లో 70.4శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని చెదరుమదురు ఘటనలు మినహా రెండు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 23వ తేదీన వెలువడనున్నాయి. జార్ఖండ్‌లో అధికార పీఠం భాజపా దక్కించుకోనుందని ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేలు చెబుతున్నాయి. ఝార్ఖండ్‌లో తుదిదశ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే ఇండియాటుడే సిసిరో , ఏబీపీ నీల్సన్‌ ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేను విడుదల చేశాయి. ఇండియాటుడే సిసిరో సర్వే ప్రకారం ఝార్ఖండ్‌లో భాజపా 41-49, జేఎంఎం 15-19, కాంగ్రెస్‌ 7-11, ఇతరులు 8-12 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఝార్ఖండ్‌లో తొలిసారి ఓ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని సర్వే అంచనా వేస్తోంది. భాజపాకు గతంలో కంటే 5.9 శాతం పెరిగి 36 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 5.6 శాతం తగ్గి 16 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. జేఎంఎంకు గతంలో కంటే 8.3 శాతం పెరిగి 20 శాతం ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ఏబీపీ నీల్సన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్డీయే 52 స్థానాలు(భాజపా-46, ఏజేఎస్‌యూ-5, ఎల్‌జేపీ-1) సాధించి అధికారం దక్కించుకుంటుందని వెల్లడించింది. యూపీఏ కేవలం 9 స్థానాలకే( కాంగ్రెస్‌-7, ఆర్‌జేడీ-1, జేడీయూ-1) పరిమితమవుతుందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *