– మళ్లీ భారీ వర్షం
– కొనసాగుతున్న సహాయక చర్యలు
చెన్నై,డిసెంబర్4(జనంసాక్షి):తమిళనాడు రాష్ట్రాన్ని వరుణుడు కరుణించాడని అనుకున్న లోపే మళ్లీ వదలకుండా వెండాడుతున్నాడు. గురువారం నుంచి కాస్త విరామం తీసుకున్న వరుణుడు చెన్నై నగరంపై మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి చెన్నై నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. దీంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ముందు కురిసిన వర్షాల కంటే ఇవి చాలా తక్కువస్థాయిలో ఉండొచ్చని స్పష్టం చేసింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు కోస్తా ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై నగరంలోని మైలాపూర్, శ్రీనగర్, కేకే నగర్, తాంబరం, చెంగల్పట్టు, మౌంట్రోడ్ తదితర ప్రాంతాలతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఉదయం కొంత తెరిపి ఇవ్వడంతో ఇళ్లలోంచి నీళ్లను ఈదుకుంటూ బయటకు వచ్చిన ప్రజలకు సమస్యలు స్వాగతం ఇచ్చాయి. తమిళనాడు ప్రజలు వంటగ్యాస్ లేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో మూడు రోజులుగా ప్రజలు పస్తులుంటున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ వరదలు తగ్గడం లేదు. ఈ క్రమంలోప్రజలకు పస్తుల పరిస్థితే దాపురించింది. పలు నివాసాలలో వంటగ్యాస్ లేక వంట చేసుకోవడం లేదు. ఆకలితోనే అలమటిస్తున్నారు. కనీసం కరెంట్ ఉన్నా ఎలక్టిక్ర్ స్టౌలపై వంట చేసుకునే వారు. అది కూడా లేదు. పోనీ వంటగ్యాస్ సరఫరా చేసుకుందామంటే రోడ్లపై నీళ్లు. వాహనాలు కదల్లేని పరిస్థితి. ఇక పెట్రోల్, డీజిల్ సరఫరా కూడా ఆగిపోయింది. ఇంధన సరఫరాకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. చెన్నైను అతలాకుతలం చేసిన వర్షాలు నిత్యవసర వస్తువుల ధరలను కొండెక్కించాయి. ప్రజలు నిత్యవసర వస్తువుల కొనుగోలు కోసం బయటకు వస్తున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశన్నంటడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తు తున్నారు. లీటర్ పాల ధర రూ. 100, రూ. గతంలో రూ. 20కి వస్తున్న మినరల్ వాటర్ ఇప్పుడు మాత్రం రూ. 150. కిలో క్యారెట్ రూ. 60. టమాటా, బీన్స్ కిలో ధర రూ. 90. పలుకుతోంది. రవాణా స్తంభించడంతో ఆహార పదార్థాలు, పాలుపండ్లు వంటివి నగరానికి చేరుకునే పరిస్థితి లేదు. అయితే కూరగాయాలు సరిపడ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు కారుమబ్బుల్లోనే గడుపుతున్నారు. భారీ వర్షాలకు నేటి వరకు 269 మంది మృతి చెందారు. సుమారు 7 వేల మంది పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు. నిత్యావసర వస్తువుల కోసం బారులు తీరారు. ప్రధనాంగా పాలు, నీళ్లు, కూరగాయల కోసం తల్లడిల్లుతున్నారు. వర్షం తెరిపివ్వడంతో సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. విశాఖ నుంచి ఆహారపదార్దాలు, తాగునీటితో బయలుదేరిన రెండు యద్దనౌకలు శుక్రవారం ఉదయం చెన్నై చేరుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, నీరు అందజేయనున్నారు. మరో వైపు చెన్నైలో శుక్రవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రెండ్రోజుల పాటు తమిళనాడు కోస్తాలో వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. దీంతో ఈనెల 6వరకు చెన్నైలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం జిల్లాల్లో కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. శుక్రవారం కూడా సెలవు ఇవ్వాలని ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇప్పటికీ అనేక ప్రాంతాలు ఇంకా వరదనీటిలోనే మునిగి ఉన్నాయి. అరక్కోణం వైమానిక స్థావరం నుంచి ఎయిరిండియా చెన్నైలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అడయార్, వేళచ్చేరి, శ్రీనగర్, మేడిచ్చూర్, మేడంబాక్కం తదితర ప్రాంతాల్లో కొంతమేర వరద తగ్గుముఖం పట్టింది. నాలుగు రోజులుగా చెన్నైలోని సగం ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శనివారం వరకు దక్షిణమధ్య రైల్వే అన్ని రైళ్లను రద్దు చేసింది. అరక్కోణం వైమానిక స్థావరం నుంచి ఎయిరిండియా విమాన సేవలు కొనసాగిస్తోంది. చెన్నై నగరాన్ని ముంచెత్తిన అడియార్ నది శాంతించింది. 3 రోజులపాటు వందల కాలనీలను నీటితో ముంచేసిన అడియార్నది ప్రవాహం తగ్గడంతో పలు ప్రాంతాలు జలదిగ్భందం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. చెంబరంపాకం, కత్తిపార, గిండి, సైదాపేట ప్రాంతాలలో నీరు తగ్గిపోవడంతో ప్రజలు నిత్యావసరాల కోసం పరుగులు తీస్తున్నారు.
ప్రజలకు వెంకయ్య కృతజ్ఞతలు
కాగా వరదల్లో చిక్కుకున్న వారికి సాయం అందించేందుకు చెన్నై వాసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. స్వచ్ఛందంగా ఆహారం తయారుచేసి బాధితులకు సరఫరా చేస్తున్నారు. కొంతమంది తాగునీరు అందిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. వరద బాధితులను ప్రతిఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. వరదల్లో చిక్కుకున్న తోటివారికి చెన్నై వాసులు తమ వంతు సహాయం చేస్తున్నారని తెలిపారు. వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న చెన్నై వాసులకు ట్విటర్ ద్వారా హేట్సాఫ్ చెప్పారు. పలువురు సోషల్ విూడియాను సమర్థవంతంగా వినియోగించుకుంటూ సాయం అందిస్తున్నారు. సామాజిక అనుసంధాన వెబ్ సైట్ల ద్వారా సేవల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ బాధితులకు బాసటగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా సోషల్ విూడియా ద్వారా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని అభిమానులను, సన్నిహితులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
వరద బాధితులకు సైనా రూ.2లక్షలు సాయం
భారీ వర్షాలు.. తమిళనాడు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. దీంతో అక్కడి ప్రజలకు పలువురు ప్రముఖులు ఆర్థిక సహాయం అందజేస్తూ.. వారికి చేయూతనిస్తున్నారు. ఈ జాబితాలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా చేరారు. సైనానెహ్వాల్ తమిళనాడు వరద బాధితులకు రూ.2లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విషయాన్ని సైనా తండ్రి హర్వీర్ సింగ్ శుక్రవారం తెలియజేశారు.
చైన్నైలో బాధితులకు ఖుష్భూ పరామర్శ
తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదనీరు ఊరు వాడను ఏకం చేయడంతో పలు ఇళ్ల గోడలు కూలిపోయాయి. దీంతో ప్రజలు రోడ్డు పాలు కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వరద బాధితులను నటి ఖుష్బూ పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి కోసం తయారు చేస్తున్న ఆహారంలోని పోషకాలను తనిఖీ చేశారు. స్వయంగా ఆమె చేతుల విూదుగా బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఆమె తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలుపుతూ… కొన్ని ఫొటోలను పో/-టస్ చేశారు. వరద బాధితుల కన్నీటిని ఆపడంలో తాను విఫలమయ్యానని, వారిని చూసి హృదయం చలించిపోయిందన్నారు. ప్రస్తుతం వారంతా సర్వస్వం కోల్పోయి… రోడ్డుపై చేరారని ఆవేదన వ్యక్తం చేశారు
ఆహార పదార్థాలు అందచేసిన ఇళయారాజా
తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆపన్న హస్తం అందించారు ఇళయారాజా. అక్కడి లిటిల్ ప్లవర్ అంధుల పాఠశాలలోని చిన్నారులకు సంగీత దర్శకుడు ఇళయరాజా ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఆయన సంగీతం అందించిన ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్ర బృందం తమ అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. రవాణాకు వీలుకాని ప్రమాదకర పరి/-థసితిల్లో ఇళయరాజా చిన్నారుల చెంతకు చేరుకుని ఆహారం అందించడం గొప్ప విషయమని పేర్కొంటూ… ఫొటోలను పంచుకున్నారు.





