– 1000 కోట్ల తక్షణ సాయం ప్రకటించిన ప్రధాని మోదీ
చెన్నై,డిసెంబర్3(జనంసాక్షి): భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమిళనాడు రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హావిూ ఇచ్చారు. తమిళనాడులో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు మోదీ గురువారం చెన్నైకి వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జయలలితలతో ప్రధాని భేటీ అయ్యారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో అధిక నష్టం వాటిల్లిందని… కేంద్రం తరపున తమను ఆదుకోవాలని సిఎం జయలలిత మోదీని కోరారు. దీంతో మోదీ స్పందిస్తూ తమిళనాడుకు తక్షణ సాయంగా వెయ్యి కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న తమిళనాడు రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకున్న మోదీ… అక్కడి నుంచి వాయుసేనకు చెందిన హెలిక్టాపర్లో చెన్నై సహా, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేశారు. వరద పరిస్థితిపై అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు.
ప్రత్యేక విమానంలో వేలూర్, రాజాలి ఎయిర్‌బేస్‌కు చేరుకున్న మోదీ, వరద నష్టంపై ఎయిర్‌పోర్టులో అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లో ఫొటోలను ఆయన పరిశీలించారు. వరదలో వాటిల్లిన నష్టంపై ఆరా తీశారు. ఏరియల్ సర్వే అనంతరం నరేంద్ర మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితో భేటీ అయ్యారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై సవిూక్ష నిర్వహించారు. అంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ప్రాధ్యాన్యం ఇవ్వాలన్నారు. కాగా, తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు కారణంగా చెన్నై వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి భారత వైమానిక దళం సహాయం అందిస్తోంది. ఇప్పటికే వర్షాలతో తమిళనాడులో 269మందికి పైగా మృత్యువాత పడినట్లు సమాచారం. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న వర్షాలతో చెన్నై అతలాకుతలమైంది. వరద ప్రభావంతో చెన్నై నగరంలో రవాణా, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. సాధారణ జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలోని పలుప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్భందంలోనే ఉన్నాయి. చెన్నై విమానాశ్రయంలో వరదనీటి ఉద్ధృతి ఇంకా తగ్గలేదు. బాధితులను రక్షించేందుకు సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయచర్యలు చేపడుతున్నాయి. ఈ విషయాలను వారు ప్రధానికి వివరించారు. పరిస్థితిని ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని జయలలితతో కూడా చర్చించారు. ఇదిలావుంటే భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న చెన్నైవాసులకు సహాయం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రెట్టింపు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సహాయకచర్యలపై సవిూక్షించడానికి గురువారం ఉదయం కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి ఆధ్వర్యంలో రక్షణ, ఆహార, రైల్వే, వ్యవసాయ, ఆరోగ్య, టెలికమ్యూనికేషన్ విభాగాల అధికారులతో పాటు
వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ విభాగం, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెన్నైలో సహాయకచర్యలకు తమ సిబ్బందిని మరింత పెంచినట్లు చెప్పారు. ఒక్కో బృందంలో 40 మంది సిబ్బంది గల 30 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యలు చేపడుతున్నాయి. మొత్తం 1200 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కృషి చేస్తున్నారు.
చెన్నైలో కాస్త కరుణించిన వరుణుడు
చెన్నైలో గత మూడ్రోజులుగా కుండపోతగా కురిసిన వర్షం గురువారం ఉదయం కాస్త తెరిపిచ్చింది. దీంతో ఉదయం నుంచి నిత్యావసర వస్తుల కోసం జనం రోడ్లపైకి వస్తున్నారు. మోకాలిలోతు నీళ్లలోనే జనం రాకపోకలు సాగిస్తున్నారు. నీళ్లను వదిలించుకునే జాడలేక బురనీటిలోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు నీటమునగడంతో బ్యాంకు లావాదేవీలు నిలిచిపోయాయి. ఏటీఎంలు పనిచేయకపోవడంతో నగదు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలు వందకు లీటర్ చొప్పున అమ్ముతున్నారని ఆందోళన చెందారు. కూరగాయలదీ అదే దారిగా ఉంది. ఇక చెన్నై విమానాశ్రమంలో భారీగా వరదనీరు చేరడంతో మూసివేశారు. తాత్కాలిక విమానాశ్రయంగా చెన్నై సవిూపంలోని అరక్కోణం ప్రాంతంలో ఉన్న నేవల్ ఎయిర్‌స్టేషన్‌ను ఉపయోగిస్తున్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఏ320 విమానంలో కొందరు ప్రయాణికులను అరక్కోణంలోని నేవల్ ఎయిర్ స్టేషన్‌కి తరలించారు. రేపటి నుంచి నేవల్ ఎయిర్ స్టేషన్లో సాధారణ విమానాల సర్వీసును ప్రారంభించనున్నట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. డిసెంబరు6 వరకు చెన్నై విమానాశ్రయాన్ని మూసేస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. నీటమునిగిన కారణంగా సిగ్నలింగ్ వ్యవస్థ తదితర వ్యవస్థలు దెబ్బతిన్నాయి.
కొనసాగుతున్న సహాయక చర్యలు
చెన్నైలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో సైన్యం నావికాదళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. తిరువళ్లూరులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 600 మందిని రక్షించాయి. ఏటీఎంలు పనిచేయకపోవడంతో నగదు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 3రోజులు వానగండం ఉండటంతో ప్రజలు హడలిపోతున్నారు.
తమిళనాట ఆస్పత్రుల్లో వైద్యసేవలకు వరదపోటు
చెన్నైలో సహాయక చర్యలు కొనసాగుతున్నా ఇంకా పరిస్థితి దారుణంగానే ఉంది. ఎక్కడికి వెల్లాలన్నా నీరు చేరి ఉండంతో బయటకు రాలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారు. దీనికితోడు అంటువ్యాధుల భయం పట్టుకుంది. మరోవైపు తమిళనాడులో వర్షాలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడంతో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా ఇంటికి వెళ్లి చిక్కుకుని పోవడంతో మళ్లీ వచ్చే దారిలోకుండా పోయింది. దీంతో ఆస్పత్రుల్లో స్టాఫ్ కొరత కారణంగా వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. ఇక ఆస్పత్రుల్లో కూడా పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. విద్యుత్ సరఫరా లేకపోవడం, జనరేటర్లలోకి డీజిల్ నిల్వలు కూడా అడుగంటిపోవడంతో చాలాచోట్ల లైట్లు కూడా వెలగడం లేదు. ఎమర్జెన్సీ సేవలకు మాత్రం సిబ్బంది అందరినీ సిద్ధంగా ఉంచారు. కీల్పాక్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలోకి నీళ్లు చేరుకున్నాయి. వాటిని మోటార్లతో తోడి బయటకు పంపుతున్నట్లు డీన్ నారాయణ బాబు తెలిపారు.రోడ్లు మొత్తం పాడవ్వడం, అన్నిచోట్లా నీళ్లు ప్రవహిస్తుండటంతో అంబులెన్సు డ్రైవర్లు రోగులను ఆస్పత్రులకు తీసుకురావడం కూడా కష్టంగా మారింది. సాధారణంగా 20 నిమిషాల్లో వెళ్లిపోయే దూరానికి
కూడా ఇప్పుడు 40 నిమిషాలకు తక్కువ పట్టడం లేదని 108 అంబులెన్సు డ్రైవర్లు వాపోతున్నారు. విూనంబాకం లాంటిచోట్ల ట్రాఫిక్ జామ్ మరింత ఎక్కువగా ఉంది. తాంబరం ప్రాంతానికి అదనంగా 5 అంబులెన్సులను కేటాయించామని, ముందుగా గర్భిణులను తరలించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ ప్రతినిధి ప్రభుదాస్ చెప్పారు. ఈ రెండు మూడు రోజుల్లో సాధారణం కంటే వెయ్యికి పైగా కాల్స్ వచ్చాయని ఆయన అన్నారు.వర్షం కొద్దిగా తెరిపి ఇవ్వగానే నర్సులు, ఇతర సిబ్బంది ఇళ్లకు వెళ్లారు. కానీ, వాళ్లు మళ్లీ తిరిగి ఆస్పత్రులకు చేరుకునే పరిస్థితి కనిపించడంలేదు. మరోవైపు గోడలు కూలి, ఇతర కారణాల వల్ల చాలామంది క్షతగాత్రులు ఆస్పత్రులకు వెళ్తున్నా, అక్కడ చికిత్స అందించే పరిస్థితి కనిపించడంలేదు. తాను కష్టవ్మిూద ఇంటికి చేరుకునేసరికి ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయని.. దాంతో సర్టిఫికెట్లు తీసుకుని దగ్గర్లో ఉన్న ఓ స్కూల్లో ఆశ్రయం పొందుతున్నానని ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే ఓ నర్సు చెప్పారు. ఆయన భార్య కూడా నర్సుగానే పనిచేస్తున్నారు. ఆమె మాత్రం ఎలాగోలా ఎగ్మోర్‌లో ఉన్న తన ఆస్పత్రికి వెళ్లారు గానీ మళ్లీ తిరిగి ఇంటికి చేరుకోలేకపోయారు.





