Monday, 2 November 2026

చౌక మద్యంపై వెనక్కి తగ్గిన సర్కార్

3g2a9g2uహైదరాబాద్ : గుడుంబా స్థానంలో చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో నిర్ణయాన్ని మార్చుకుని పాతపద్ధతిలోనే చీప్‌ లిక్కర్‌ను విక్రయించాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. గుడుంబా తయారు చేసేవారిపై పీడీయాక్ట్‌ నమోదు చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గుడుంబా అమ్మకాలపై ఉక్కుపాదం మోపనుంది సర్కార్‌. ఇందుకు ఐజీస్థాయి అధికారిని నియమించనుంది .
గుడుంబా నివారించాలనే పేరుతో గ్రామాల్లో 15 రూపాయలకే చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని కొత్త ఎక్సైజ్ పాలసీలో చేర్చాలని భావించింది. దీనికోసం బాటిళ్ళు డిజైన్‌తో పాటు వాటిని ప్రత్యేకంగా ఎలా అమ్మాలో, ఎంత ధరకు విక్రయించాలో కూడా ఆబ్కారీ అధికారులకు సూచనలు కూడా ఇచ్చారు. అయితే సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఉహించని ప్రజాగ్రహం వ్యక్తమైంది. ఇటీవల గ్రామజ్యోతి సందర్భంగా క్షేత్రస్థాయిలో తిరుగుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులపై దీని ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది. మాహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, విపక్షాలు, ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో..ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రులు తీవ్ర ఒత్తిడి చేయడంతో సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయమం తీసుకున్నారు.
చీప్‌ లిక్కర్‌ అమలుపై తొలుత ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తున్నప్పుడు ప్రజాభిప్రాయం అవసరంలేదని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమే మంచిదని కొందరు సీనియర్ ఐఏఎస్‌ అధికారులు సీఎంకు సూచించారు. చౌకమద్యం ప్రవేశపెడితే..ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డపేరు వస్తుందని మహిళలు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే అవకాశాలు ఎక్కువున్నాయని ఇంటలిజెన్స్‌ అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీంతో ప్రభుత్వం పునరాలోచనచేసి ఈ ఏడాదికి చూక మద్యం ప్రవేశపెట్టకూడదని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతించాయి. మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మొత్తానికి చౌక మద్యంపై సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *