Monday, 2 November 2026

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

C
– 8 మంది మావోయిస్టుల మృతి

ఖమ్మం,మార్చి1(జనంసాక్షి): ఖమ్మం-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌ లోని బీజపూర్‌ జిల్లా బటోటంగ్‌ గ్రామ సవిూప అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. తెలంగాణ పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భీకర కాల్పలు చోటుచేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌ పూర్తి అయిన తర్వాత ఘటనా స్థలంలో పోలీసుల 6 ఎస్‌ఎల్‌ఆర్‌లు తుపాకులు, 2 ఏకే47 గన్‌లతో పాటు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్లో చర్లమండలం ఎల్‌ఓఎస్‌ కమాండర్‌ లచ్చన్న, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ ఉన్నట్టు సమాచారం. మృతుల్లో ఐదుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారని పోలీసు తెలిపారు.ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమన్‌ సింగ్‌ మాట్లాడుతూ తెలంగాణ పోలీసులతో కలిసి సంయుక్తంగా చేసిన ఆపరేషన్‌ ఇదని చెప్పారు. అటవీ ప్రాంతంలో రెండు రోజుల ముందు నుంచే కూంబింగ్‌ జరుగుతోందని ఆయన అన్నారు. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు అగ్రనేతలు మృతి చెందారని సీఎం వెల్లడించారు. మూడు, నాలుగేళ్లలో ఇదే పెద్ద ఆపరేషన్‌ అని రమన్‌ సింగ్‌ తెలిపారు.

భద్రాచలం ఆస్పత్రికి మావోయిస్టుల మృతదేహాలు

ఖమ్మం-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఈరోజు ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి హెలికాప్టర్‌లో తరలించారు. మావోయిస్టుల మృతదేహాలకు ఇక్కడే శవపరీక్ష నిర్వహించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా దక్షిణ బస్తర్‌ ఏరియాలోని చింతవాడు అటవీప్రాంతం గొట్టెపాడు పరిసరాల్లో చర్ల మండలం కేంద్రం సరిహద్దుకు 15 కిలోవిూటర్ల దూరంలో ఈరోజు భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో  ఉదయం ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌, గ్రేహౌండ్స్‌ బలగాలు, పోలీసులు సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి మావోయిస్టులు ఎదురుకావడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఐదుగురు మహిళా మావోయిస్టులు సహా 8 మంది మృతిచెందారు. సంఘటనా స్థలం నుంచి ఏకే 47, 6 ఎస్‌ఎల్‌ఆర్‌లు, మూడు 303 రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కాగా  ఖమ్మం-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ ఘటనలో 8 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారని  డీజీపీ అనురాగ్‌శర్మ విూడియాకు తెలిపారు. ఉదయం7.30 గంటలకు పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు..ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారని డీజీపీ చెప్పారు.  మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలున్నారని ఆయన తెలిపారు. మావోయిస్టులు దాడులకు పాల్పడుతారని సమాచారం ఉంది. అందుకే తెలంగాణ పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడ్డారని డీజీపీ పేర్కొన్నారు. చనిపోయిన మావోల నుంచి ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్‌, మూడు 303, ఎస్‌బీపీఎల్‌ గన్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు అనురాగ్‌ శర్మ తెలిపారు. అయితే మావోయిస్టులు ఎవరన్నది ఇంకా గుర్తించలేదని..త్వరలో వారి వివరాలను విూడియాకు చెబుతామని డీజీపీ అనురాగ్‌శర్మ చెప్పారు. ఇదిలావుంటే భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 8 మంది మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు.  పోస్టుమార్టం బందోబస్తు నడుమ కొనసాగించారు.  పోస్టుమార్టం పక్రియను పోలీసులు వీడియో తీసారు.  ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా బస్తర్‌ ఏరియాలోని చింతవాడు అటవీ ప్రాంతం గొట్టెపాడు పరిసరాల్లో చర్ల మండల కేంద్రం సరిహద్దుకు 15 కిలో విూటర్ల దూరంలో ఇవాళ మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మహిళా మావోయిస్టులతో సహా ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్‌, గ్రేహౌండ్స్‌ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయి. అయితే ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు ముఖ్య నేతలు కూడా ఉన్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *