Monday, 2 November 2026

జంటనగరాల్లో ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు


0vbrfhl3హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులు నగరంలో పలు ఆంక్షలు విధించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొత్త సంవత్సర ఉత్సవాల నిర్వహణకు వివిధ శాఖల ముందస్తు అనుమతులు పొందిన వారికే పోలీసులు అనుమతులిచ్చారు. ఉత్సవాల నిర్వాహకులకు, వేడుకల్లో పాల్గొనే ప్రజలకు పలు ఆంక్షలు విధించారు. ఆంక్షలు దాటితే కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
 

డిసెంబరు 31 వేడుకల నేపథ్యంలో జంట కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు కొనసాగనున్నాయి. వాహనాల రాకపోకల్ని నియంత్రించేందుకు పోలీసులు ఆంక్షలను అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు వరకు సిటీలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. అటు ఓఆర్ఆర్ పై విమాన ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. పబ్బులు, రిసార్టులు, ఇతర వేడుకలు జరిగే ప్రాంతాలపై నిర్వాహకులకు పోలీసులు ఇదివరకే ముందుజాగ్రత్త చర్యల్ని సూచించారు. తాజాగా రహదారులపై దృష్టి పెట్టారు పోలీసులు . వేడుకల్లో పాల్గొని, తిరిగి ఇళ్లకు వెళ్లే క్రమంలో ప్రమాదాల బారిన పడకుండా పలు మార్గాల్లో ఆంక్షలు విధించనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం అయిదు గంటల వరకు పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే సహా జంట కమిషనరేట్ల పరిధిలోని అన్ని ఫ్లైఓవర్లను మూసేస్తారు. పలు ప్రాంతాల్లో తాత్కాలిక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తారు.

 

నగర కమిషనరేట్‌ పరిధిలోని ఎన్టీఆర్‌మార్గ్‌, నెక్లెస్‌రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌లపై గురువారం రాత్రి పది గంటల నుంచి రెండు గంటల వరకు వేడుకల నిర్వహణకు అనుమతిస్తారు. ఆ సమయంలో సాధారణ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.

 

వి.వి.విగ్రహం వైపు నుంచి నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్‌మార్గ్‌ వైపు వెళ్లాల్సిన వారు విగ్రహం దగ్గర నుంచి ఖైరతాబాద్‌, రాజ్‌భవన్‌ రోడ్డు మీదుగా ప్రయాణించాలి. బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌మార్గ్ కు అనుమతి ఉండదు. ఇటుగా వెళ్లాల్సిన వారు ఇక్బాల్‌ మినార్‌, లక్డీకాపూల్‌, అయోధ్య కూడలి మీదుగా సాగాలి.

 

లిబర్టీ కూడలి నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లాల్సిన వారిని ఎంసీహెచ్‌ కార్యాలయం వై-కూడలి వద్ద నుంచి బీఆర్‌కే భవన్‌, తెలుగుతల్లి, ఇక్బాల్‌ మినార్‌, రవీంద్రభారతి, లక్డీకాపూల్‌, అయోధ్య కూడలి మీదుగా పంపిస్తారు.

 

ఖైరతాబాద్‌ మార్కెట్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వెళ్లాల్సిన వారు మీరా టాకీస్‌ గల్లీ నుంచి సాగాలి. సాధారణ ప్రయాణికుల్ని సచివాలయం పక్కనే ఉన్న మింట్‌కాంపౌండ్‌ మార్గంలోకి అనుమతించరు. నల్లగుట్ట రైల్వే వంతెన నుంచి సంజీవయ్యపార్క్‌, నెక్లెస్‌రోడ్డుకు అనుమతి లేదు. ఈ రూట్ లో ప్రయాణించే వారు కర్బలా మైదాన్‌, మినిస్టర్స్‌ రోడ్డు మీదుగా వెళ్లాలి.

 

రాంగోపాల్‌పేట ఠాణా పరిధిలోని పీజీ రోడ్డు, రాణిగంజ్‌ కూడలి, మినిస్టర్‌రోడ్డు, రసూల్‌పుర కూడలి, తదితర ప్రాంతాల్లో 18 పికెట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నెక్లెస్‌రోడ్డును 10.30 గంటల తరువాత మూసివేయనున్నారు.

 

సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే వారిని సెయిలింగ్‌ క్లబ్‌ మీదుగా కవాడీగూడ క్రాస్‌రోడ్డు, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ గుడి, అశోక్‌నగర్‌, ఆర్‌టీసీ క్రాస్‌రోడ్డు మీదుగా పంపిస్తారు. బయటి నుంచి వచ్చే బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలకు రాత్రి రెండు గంటల వరకు నగరంలోకి అనుమతించరు.

 

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై పకడ్బందీ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఓఆర్ఆర్ పై విమాన ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. వారు ప్రయాణ టిక్కెట్లను చూపించాల్సి ఉంటుంది.వేడుకలు జరిగే ప్రాంతాల్లో నిర్వాహకులే సరైన భద్రత ఏర్పాట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వేడుకలకు వచ్చేవారి వాహనాలకు సరైన పార్కింగ్‌ ప్రాంతాల్ని అందుబాటులో ఉంచాలి.

 

పోలీసుల ఆంక్షలివి…
* నూతన సంవత్సర వేడుకలను గురువారం రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి గంట వరకే నిర్వహించాలి.
* ప్రత్యేక ఆహ్వానాల ద్వారా… అది కూడా జంటలను మాత్రమే వేడుకలకు అనుమతించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలు, పురుషులను ఒంటరిగా అనుమతించరాదు.
* మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానాలు
* వేడుకల్లో సాధారణ మైకులే వాడాలి. అవి కూడా 35 డెసిబెల్స్‌కు మించరాదు. డీజేలపై పూర్తిగా నిషేధం.
* వేడుకల్లో అర్ధనగ్నంగా నృత్యాలు చేయడం నిషేధం.
* మద్యం మత్తులో మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠినచర్యలు
* రహదారులపై పార్కింగ్‌కు అనుమతి లేదు. పోలీసులు ఏర్పాటుచేసిన పార్కింగ్‌ ప్రదేశాల్లోనే వాహనాలు ఉంచాలి.
* 31 తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు, రింగ్‌రోడ్‌, పీవీఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే మూసివేస్తారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సిన ప్రయాణికులు తగిన ఆధారాలు చూపిస్తే ప్రత్యేక అనుమతి ఇస్తారు.
* వేడుకలు నిర్వహించే హోటళ్లు, రిసార్టుల నిర్వాహకులు సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేయాలి. బాణాసంచా పేల్చరాదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *