జగన్‌ది కేవలం పదవీ కాంక్ష : పీతల
ఏలూరు,జూలై31(జనం సాక్షి): అభివృద్ధి సంక్షేమం సమపాళ్లుగా టిడిపి ప్రభుత్వం కార్యక్రమాలను కొనసాగిస్తుందని మాజీ మంత్రి పీతల సుజాత చెప్పారు. రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలు లేకుండా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.రాష్ట్రంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనులు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఏదో ఒక వంకతో గొడవలు సృష్టించాలని జగన్ చూస్తున్నారని అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పటం నిజమేనని.. గత రెండేళ్ల కాలంలో11 వేలకు పైగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకం జరిగిందన్నారు. 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుది అభివృద్ధి కాంక్ష అయితే జగన్‌ది పదవీ కాంక్షని పేర్కొన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా తగిన శిక్షణ ఇచ్చి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నాం.. ఇవన్నీ ఉద్యోగాలు కావా అని మంత్రి అన్నారు. పోలవరం నిర్వాసితులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి మెరుగైన నష్టపరిహారం అందిస్తున్నారన్నారు.