చెదురుమదురు ఘటనలు మినహా (కిక్కర్)
జమ్మూకాశ్మీర్‌లో 71.28శాతం, జార్ఖండ్‌లో 62శాతం
న్యూఢిల్లీ, నవంబర్ 25 (జనంసాక్షి) : చెదురుమదురు ఘటనలు మినహా జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జమ్మూకాశ్మీర్‌లో 71.28శాతం, జార్ఖండ్‌లో 62శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నా ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎముకలు చలిలోనూ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో తొలుత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ తర్వాత క్రమంగా పుంజుకొంది. మధ్యాహ్న సమయానికి జార్ఖండ్‌లో 48.28 శాతం, కాశ్మీర్‌లో 33 శాతం ఓటింగ్ నమోదైంది. మంగళవారం తొలి విడతలో కాశ్మీర్‌లో 15 స్థానాలకు, జార్ఖండ్‌లో 13 చోట్ల ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చినా ఓటర్లు మాత్రం వెనుకడుగు వేయలేదు. దీంతో పోలింగ్ ఎక్కువగా నమోదైంది. తొలి నాలుగు గంటల్లో 26.5 శాతం మేర ఓటింగ్ నమోదు కాగా.. ఆ తర్వాత మరింత పుంజుకొంది. 13 నియోజకవర్గాల్లో ఆరు మావోల ప్రాబల్యం ఉన్న స్థానాలు కావడంతో అక్కడ భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. ఒకటి రెండుచోట్ల మినహా మిగతా అంతటా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందని ఎన్నికల ప్రధానాధికారి పీకే జజోరియా తెలిపారు. రెండుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని వివరించారు. హుస్సేన్‌బాద్ నియోజకవర్గంలో మందుపాతరను వెలికితీశామని, మరో రెండ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గతంలో కంటే ఈసారి పోలింగ్ ఎక్కువగా నమోదవుతోందని చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి పుంజుకొంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో మధ్యాహ్న సమయానికి 33 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికలు బహిష్కరించాలని విభజనవాదులు పిలుపునిచ్చినా, ప్రతికూల వాతావరణం ఏర్పడినా ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ప్రజలు తరలివచ్చారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎముకలు కొరికే చలిలోనూ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఆసక్తి చూపారు. వాస్తవానికి జమ్మూలో రెండ్రోజుల నుంచి మైనస్ డిగ్రీలలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం కూడా విపరీతమైన చలి ఉంది. చలి కారణంగా ఉదయం కొంతసేపు పోలింగ్ మందకొడిగా సాగినప్పటికీ తర్వాత ఊపందుకొంది. మధ్యాహ్నం సమయానికి దోడా నియోజకవర్గంలో అత్యధికంగా 41 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యంత చలి కారణంగా లేహ్‌లో అత్యల్పంగా 10 శాతం ఓటింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే, తీవ్రవాదులు పోలింగ్‌ను అడ్డుకొనేందుకు యత్నించారు. రెండు పోలింగ్ కేంద్రాలకు సవిూపంలో పేలుళ్లకు పాల్పడ్డారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. పేలుళ్ల అనంతరం కూడా ఓటింగ్ కొనసాగిందని పేర్కొన్నారు. బర్సూ ప్రాంతంలో పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు.





