Monday, 2 November 2026

లోక్‌సభలో నల్లధనం ప్రకంపనలు

5

చర్చకు విపక్షాల పట్టు

ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్‌ పేరుపై తెరాసా అభ్యంతరం

న్యూఢిల్లీ, నవంబర్‌ 25 (జనంసాక్షి) : లోక్‌సభలో నల్లధనం అంశం ప్రకంపనలు సృష్టించింది. ఈ సమస్యపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. తెలంగాణలోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు డొమెస్టిక్‌ టర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు పెట్టడాన్ని టీఆర్‌ఎస్‌ ఎంపీలు తప్పుబట్టారు. పేరు మార్పుపై వారు అభ్యంతరం వ్యక్తంచేశారు. నల్లధనం అంశం మంగళవారం లోక్‌సభను కుదిపేసింది. బ్లాక్‌మనీపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. నల్లధనంపై చర్చ జరపాల్సిందేనని, బ్లాక్‌మనీని వెనక్కు తెప్పించాలని డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని నినాదాలు చేశాయి. సభ రెండుమార్లు వాయిదా పడినప్పటికీ విపక్షాలు పట్టువీడలేదు. మరోవైపు, నల్లధనంపై చర్చించేందుకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. సభ సజావుగా జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. నల్లధనంపై ఎటువంటి సమాచారమైనా దాచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.మంగళవారం లోక్‌సభ సమావేశమైన అనంతరం స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభించారు. అయితే, నల్లధనంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామన్న హావిూని ప్రభుత్వం నెరవేర్చుకోవాలని డిమాండ్‌ చేశారు. జవాబ్‌ దో.. జవాబ్‌ దో అంటూ నినాదాలు చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. గొడుగులు పట్టుకొని నిరసన తెలుపుతూ నల్లధనాన్ని వెనక్కు తేవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఆప్‌, సమాజ్‌వాదీ ఎంపీలు వారితో జత కలిశారు. బ్లాక్‌మనీని వెనక్కు తెప్పించడంపై ప్రదానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, నల్లధనంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరారు. అందుకు స్పీకర్‌ అనుమతించలేదు. ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం సరికాదని, బ్లాక్‌మనీ అంశంపై వేరే నిబంధనల కింద చర్చకు అనుమతిస్తానని తెలిపారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని సభాపతి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. సభలో గొడుగులు ప్రదర్శించడంపై మండిపడ్డారు. ఆమె విజ్ఞప్తిని పట్టుంచుకోకుండా విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీనిపై స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను అడ్డుకోవాలన్న ఉద్దేశ్యమే విూలో కనబడుతోందని వ్యాఖ్యానించారు. నల్లధనంపై చర్చ జరగాలని విూరు కోరుకోవడం లేదు.. కేవలం అల్లరి చేసేందుకు వచ్చారని సుమిత్ర మహాజన్‌ విమర్శించారు. అయినటప్పటికీ విపక్షాలు ఆందోళన విరమించలేదు. దీంతో వారి నినాదాల మధ్యే ఆమె ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. కానీ, ప్రతిపక్షాల ఆందోళనలతో అది సాధ్యం కాలేదు. సభలో గందరగోళం కొనసాగడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.తిరిగి సభ సమవేశమైన అనంతరం విపక్షాలు ఆందోళనను కొనసాగించాయి. నల్లధనంపై చర్చ చేపట్టాలి.. ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని నినాదాలు చేశాయి. వారి నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. ఆ తర్వాత జీవో అవర్‌ చేపట్టారు. ఈ సందర్భంగా పలు అంశాలను వివిధ పార్టీల నేతలు సభలో ప్రస్తావించారు. తమ ఆందోళనలు పట్టించుకోకపోవడంతో విపక్ష సభ్యులు మరింత గట్టిగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుంటూ.. నల్లధనంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సభ సజావుగా జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నల్లధనంపై ఎటువంటి సమాచారమైనా దాచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఏ నిబంధన కింద అయినా చర్చిద్దామని, సభకు సహకరించాలని కోరారు. బ్లాక్‌మనీ అంశంపై చర్చకు వెనుకడుగు వేసేది లేదని, ఎప్పుడైనా సిద్ధమేనన్నారు. పదేళ్లలో బ్లాక్‌మనీపై యూపీఏ ఏం చేయలేక పోయిందని, తాము వచ్చిన ఆరు నెలల్లోనే చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం  చర్చకు సిద్ధంగా ఉందని చెబుతున్నా.. ఇంకా ఆందోళన చేయడం ఎందుకని ప్రశ్నించారు. అయినప్పటికీ విపక్షాలు శాంతించలేదు. దీంతో సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.

విమానాశ్రయం పేరు మార్పుపై టీఆర్‌ఎస్‌ ఆగ్రహం

శంషాబాద్‌ విమానాశ్రయంలోని డెమొస్టిక్‌ టెర్మినల్‌ పేరు మార్పుపై టీఆర్‌ఎస్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎయిర్‌పోర్టు పేరు మార్చడం ఎంతవరకు సమంజసమని కేంద్రాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంత నాయకుడి పేరును తెలంగాణలోని విమానాశ్రయానికి పెట్టడం సమంజసం కాదని టీఆర్‌ఎస్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ అన్నారు. తక్షణమే ఎన్టీఆర్‌ పేరును తొలగించాలని, గతంలో ఉన్న విధంగా ఒకే పేరును కొనసాగించాలని కోరారు. మంగళవారం లోక్‌సభలో జీరో అవర్‌ సందర్భంగా ఎయిర్‌పోర్టు పేరు మార్పు అంశాన్ని వినోద్‌ సభలో లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో అంతర్భాగంగా ఉన్న డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఇటీవల పేరు మార్చారని సభ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒత్తిడితో కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, ఆయన పార్టీకి చెందిన పౌరవిమానాయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఉత్తర్వులు జారీ చేశారని విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని, తెలంగాణలో ఉన్న విమానాశ్రయానికి ఆంధ్ర నాయకుడి పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఎక్కడైనా ఎయిర్‌పోర్టుకు ఒకే పేరు ఉంటుందని వివరించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రాజీవ్‌గాంధీ పేరు ఉండగా, మళ్లీ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు పెట్టారని ధ్వజమెత్తారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరును వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. అయితే, దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు పెట్టడాన్ని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ సమర్థించారు. ఎన్టీఆర్‌ ఒక ప్రాంతానికి చెందిన నాయకుడు కాదని, ఆయనకు ప్రాంతీయ తత్వం ఆపాదించవద్దని కోరారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్‌ ఒక చిహ్నమని పేర్కొన్నారు. ఆయన జాతీయ నేత అని, నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా పని చేశారని, దేశ రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారని గుర్తు చేశారు. డొమెస్టిక్‌ టెర్మినల్‌కు గతంలో ఉన్న ఎన్టీఆర్‌ పేరును కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలగించిందని.. నాటి తప్పును ఎన్డీయే సర్కారు సరిదిద్దిందని వివరించారు. శంషాబాద్‌ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *