భాజపా, కాంగ్రెస్‌తో కలవం-ఒమర్ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్, డిసెంబర్22 (జనంసాక్షి) : జమ్మూకశ్మీర్‌లో 12వ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర ఎన్నికల అధికారి ఉమాంగ్ న/ొలా తెలిపారు. జిల్లా కేంద్రాలలో 28 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. కుప్వారా, బారాముల్లా, దోడా జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువ లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా, మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. కశ్మీరీ శరణార్థుల ఓట్లు జమ్ము, దిల్లీ, ఉదంపూర్‌లలోనే లెక్కించనున్నారు. మొత్తం 5వేల మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నట్లు ఉమాంగ్ తెలిపారు. రాష్ట్రంలోని 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 276 మంది స్వతంత్రులు సహా 821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రెండు నియోజకవర్గాలు బీర్వా, సొనావర్ నుంచి పోటీచేస్తున్నారు. ప్రతిపక్ష పీడీపీ పార్టీ అధినేత ముఫ్తీ మహమ్మద్ సయీద్ అనంతనాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఇక భాజపా, కాంగ్రెస్‌లతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నందుకు విచారించడం లేదని ఆయన పేర్కొన్నారు. మతమార్పిళ్ల అంశంపై ప్రధాని మోదీ నోరు విప్పడం లేదని ఆయన విమర్శించారు.




