నైతిక విలువలతో కూడిన కేజీ టూ పీజీ విద్య
ఉద్యాన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కుకు యోచన
సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,డిసెంబర్22 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలోని విద్యా విధానం వృత్తి నైపుణ్యాన్ని పెంచే విధంగా, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్ధులు పోటీ పడేలా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. రాష్ట్రంలో కేజి టు పిజి ఉచిత విద్యా విధానాన్ని అమలు చేయడం ప్రభుత్వ లక్ష్మమని చెప్పారు. కేజి టు పిజి విద్యా విధానం ఎలా ఉండాలి అనే విషయంపై విద్యా రంగంలోని నిపుణులతో తానే స్వయంగా రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణలో కేజి టు పిజి విద్యా విధానం అంశంపై సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సవిూక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి డా.రాజయ్య, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు బివి.పాపారావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్శింగారావు,కన్సల్టెంట్ ఉపేందర్ రెడ్డి, ఎస్‌ఇఆర్‌టి డైరెక్డర్ జగన్నాధ రెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి, ఓఎన్‌డి (విద్య) దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు. తెలంగాణలో విద్యా విధానం బావితరాలను ఉత్తమపౌరులుగా,దేశానికి ఉపయోగపడే మానవ వనరులుగా తయారు చేసే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. విద్య కోసం పెట్టే ఖర్చు వృధా పెట్టుబడి అనే నీచ ప్రచారం కూడా గతంలో జరిగిందని, ఫలితంగా ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రమాణాలు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కాని తమ ప్రభుత్వం విద్య కోసం పెట్టే ఖర్చును అత్యంత ఉపయుక్తమైన కార్యక్రమంగా భావిస్తున్నదని, మంచి విద్యను అందించడం ద్వారానే మానవ వనరుల అభివృద్ది జరుగుతుందనేది తన దృఢ విశ్వాసమని ముఖ్యమంత్రి అన్నారు. కేజి టు పిజి విద్యావిధానాన్ని ఎలా అమలు చేయాలనే విషయంపై ఈసందర్బంగా చర్చించారు. ఏ తరగతి నుండి ఇంగ్లీష్ విూడియం ప్రారంభించాలి! ఏవయసు నుండి పిల్లలు హాస్టల్‌లో వుండటం మంచిది ! విద్యా బోధన చేయడానికి ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు సరిపోతారా! వారికి అదనంగా ఏమైనా శిక్షణనివ్వాలా! బోధన అంశాలు ఎలా ఉండాలి! తదితర విషయాలపై చర్చించారు. కేజి టు పిజి విద్యా విధానం మెత్తం సమాజంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి దీనిపై విస్తుత్ర స్థాయిలో చర్చ జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకోసం త్వరలో ఎస్‌ఇఆర్‌టి,ఎన్‌సిఇఆర్‌టి, ప్రొఫెసర్లు,విద్యావంతులు, విద్యా రంగంలో అనుభవం ఉన్న వారితో తానే స్వయంగా రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహిస్తానని,అందరి అభిప్రాయలు తీసుకొంటానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక బృందాన్ని దేశంలో,ప్రపంచంలో అత్యున్నత విద్యా విధానం అమలు చేస్తున్న ప్రాంతాలకు పంపి అధ్యయనం చేయిస్తానని కూడా వెల్లడించారు. ఈ రెండు ప్రక్రియలు పూర్తయిన తరువాత తెలంగాణలో కేజి టు పిజి విద్యా విధానం అమలుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కేజి టు పిజి విద్యా విధానంలో భాగంగా మొదటి సంవత్సరం నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించి, నిర్వహణలోని సాధక బాధకాలను గమనించి మరుసటి ఏడాది నుండి పాఠశాలలను విస్తరించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. పది నుండి పదిహేను ఎకరాల స్ధలంలో ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండాలని, అందులో హాస్టల్,స్కూల్, ప్లే గ్రౌండ్,డైనింగ్ హాల్ తదితర నిర్మాణాలన్నీ అత్యంత ఆధునికంగా, సౌకర్యవంతంగా ఉండాలన్నారు. అటాచ్డ్ టాయిలెట్‌తో కూడిన గదిలో నలుగురు విద్యర్ధులు మాత్రమే ఉండాలన్నారు. గురుకుల పాఠశాలల్లో అందించే ఆహారం కూడా పోషక విలువలతో కూడుకుని ఉండాలని చెప్పారు. కేవలం పప్పు చారుతో సరిపెట్టకుండా గుడ్డు,తాజా, నాణ్యమైన కూరగాయలు వండాలని, ప్లేట్లు, గ్లాసులను కూడా స్టెరిటైజ్ చేసి వాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. కలెక్టర్,ఎస్‌పి లాంటి అధికారులు కూడా తమ పిల్లలను ఈ పాఠశాలల్లోనే చదివించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యర్యంలోని వివిధ స్కీముల్లో అనేక తరహ పాఠశాలలు ప్రస్తుతం ఉన్నాయని, వాటిన్నంటిని క్రమంగా రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తామన్నారు. రాష్ట్రమంతా ఒకే తరహా పాఠశాలలు, ఒకే సిలబప్,ఒకే భోజన మెనూ, ఒకే పద్దతి, ఒకే పరీక్షల విధానం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. కుల మతాల గురించి పట్టింపు లేకుండా పిల్లలందరూ ప్రభుత్వ ఖర్చుతోనే ఒకే చోట చదవాలని, దీనివల్ల అంతరాలు లేని సమాజం సృష్టించవచ్చని ముఖ్యమంత్రి అభిలాషించారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఓ నవ లోకం కావాలని ఆకాంక్షించారు. పాఠ్యాంశాల్లో శాంతి భద్రతలు, మహిళల పట్ల గౌరవంగా ఉండడం, సాంస్కృతిక వికాసం,నైతిక ప్రవర్తన లాంటి అంశాలు కూడా ఉండాలని చెప్పారు. విద్యా విధానం విద్యార్ధుల్లో వృత్తి నైపుణ్యం పెంచే విధంగా ఉండాలని అన్నారు. భవిష్యత్తులో ఎంతమంది డాక్టర్లు,ఇంజనీర్లు,ఇతర ఉద్యోగులు, వృత్తి నిపుణులు కావాలో ముందుగానే అంచనా వేసుకొని అందుకు అనుగుణంగా విద్యార్ధులను తీర్చిదిద్దటం ఉత్తమమైన మార్గమని ముఖ్యమంత్రి అన్నారు.
తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపు పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎం కెసిఆర్ ఆమోదం తెలిపారు. గతంలో కొండా లక్ష్మణ్ పేరు నిలిచేలా కార్యక్రమం చేపడతామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ మేరకు సిఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పే ఉద్యానవన యూనివర్సిటికి కొండా లక్ష్మణ్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇటీవల కొండాలక్ష్మణ్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,కొండా లక్ష్మణ్ పేరుపై ఓ విద్యాసంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దాని ప్రకారమే ఉద్యనవన యూనివర్సిటికి కొండా లక్ష్మణ్ పేరు ఖరారు చేశారు. మరోవైపు ప్రత్యక్ష,పరోక్ష,ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రజలకు కావలసిన వస్త్ర సంబంధ ఉత్పత్తులన్ని ఒకే చోట లభించే విధంగా వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దేశంలోని ఎక్కువ వస్త్ర ఉత్పత్తులు జరిగే సూరత్,షోలాపూర్,తిర్పూర్ లాంటి నగరాల్లో అధ్యయనం చేసి వరంగల్ టెక్స్‌టైల్స్ పార్కుకు తుది రూపం ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు బివి.పాపారావు, వరంగల్ ఎంపి కడియం శ్రీహరి,వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, అధికారులతో కూడిన బృందం ఈ వారంలోనే సూరత్ పర్యటించి రావాలని, నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని సిఎం కోరారు. ఒక్క వరంగల్ జిల్లా నుండే దాదాపు మూడు లక్షల మంది సూరత్‌కు వెళ్లి టెక్స్‌టైల్ పరిశ్రమలో పనిచేస్తున్నవారు ఉన్నారని, వారంతా నైపుణ్యం, అనుభవం సంపాదించారని, అలాంటి వారిని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సూరత్‌లో చీరలు, సల్వార్ లాంటి ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయని, షాలాపూర్‌లో నాణ్యమైన చద్దర్లు తయారవుతాయని, తిర్పూర్‌లో డ్రస్ మెటీరియల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని సీఎం అన్నారు. ఈ మూడు రకాల ఉత్పత్తులతో పాటు మిగతా అన్ని రకాల వస్త్ర సంబంధ ఉత్పత్తులు వరంగల్‌లోనే తయారు కావాలని ముఖ్యమంత్రి అన్నారు. అందుకు అనువైన పరిశ్రమలను స్థాపించడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈ రంగంపై ఆధారపడిన వారు ఎక్కడే పనిచేసుకొని బతకాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వరంగల్ నగరం చూట్టూ ఇప్పటికే ప్రభుత్వ భూములు సేకరించి పెట్టామని, వాటిలో టెక్స్‌టైల్స్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. నాణ్యమైన వస్తువులను విక్రయించడానికి అనువుగా వరంగల్ నగరంలోనే స్టాల్స్ ఏర్పాటు చేయడానికి మార్కెట్ నిర్మిస్తామని కూడా వెల్లడించారు. ఈ మేరకు వీరితో సిఎం సవిూక్షించారు.





