– 100 ఎకరాల్లో టౌన్‌షిప్
– వంద శాతం ప్రభుత్వ ఖర్చుతో నిర్మాణం
– ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
హైదరాబాద్,జనవరి29(జనంసాక్షి):జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హావిూని నెరవేర్చే దిశగా ముందుకెళ్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సీఎం కేసీఆర్ తో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఇవాళ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బ్యూరో, డెస్క్, వీడియో, ఫొటో లాంటి విభాగాలకు చెందిన జర్నలిస్టులకు సకల సౌకర్యాలతో కూడిన ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. జర్నలిస్టులకు ఒకేచోట ఇండ్లు నిర్మించడానికి దాదాపు 100 ఎకరాల స్థలం కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. పేదల కోసం కట్టే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఇచ్చే నిధుల కంటే అదనంగా నిధులు వెచ్చించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 100 శాతం ప్రభుత్వ ఖర్చుతో జర్నలిస్టులందరికి ఇండ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. గేటెడ్ కమ్యూనిటీలో రెసిడెన్షియల్ టవర్లు, క్లబ్ హౌస్ లు, మార్కెట్లు, స్కూలు, ప్లే గ్రౌండ్, పార్క్, మల్టీప్లెక్స్ ఉండేలా అద్భుతమైన న్యూ టౌన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. పాత జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల రద్దుకు ఇవాళ ముఖ్యమంత్రిని కలిసిన జర్నలిస్టు సంఘాల నాయకులు అంగీకారం తెలిపినట్టు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. సొసైటీల ద్వారా జర్నలిస్టులు గతంలో ప్రభుత్వానికి చేసిన డిపాజిట్ డబ్బులను తిరిగి చెల్లించాలని నిర్ణయించినట్టు సమాచారం. మొదటి విడత హైదరాబాద్, వరంగల్ నగరాల్లో.. ఆ తర్వాత దశల వారీగా జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులకు రెసిడెన్షియల్ టవర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. వచ్చే బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశముందని సీఎంవో వర్గాలు తెలిపాయి. జర్నలిస్టుల టౌన్ షిప్ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్, మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్, టీఎస్ ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డిలకు సీఎం ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. అధికారులు, జర్నలిస్టులు, జర్నలిస్టు నాయకులు శనివారం (రేపు) హైదరాబాద్ నగరంలో పర్యటించి అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్టు సమాచారం. స్థల ఎంపిక తర్వాత మంచి లేఅవుట్ రూపొందించి మార్చిలోనే శంకుస్థాపన చేసి ఏడాదిలోగా ఇండ్లు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించినట్టు సీఎంవో వర్గాల సమాచారం. ప్రతీ జర్నలిస్టుకు సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో, సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టు కుటుంబాలకు, పిల్లలకు ఇల్లు రూపంలో ఆస్తి మిగలాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎంవో వర్గాలు వెల్లడించాయి.





