Monday, 2 November 2026

జలవిప్లవానికి నాంది- పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

Sri-Naradasu-Laxman-Rao
ఎమ్మెల్సీ నారదాసు

హైదరాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): తెలంగాణా రాష్ట్రంలో జల విప్లవానికి నాందిగా మారేలా తమ ప్రభుత్వం మంచి ప్రతిపాదనలతో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబందించి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ చేస్తుంటే తోకముడుచుకుని కాంగ్రెస్‌ పారిపోవడం సిగ్గుచేటని కరీంనగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు చురకలు అంటించారు. గురువారం అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న సందర్బంగా తెలంగాణా ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయినట్లుగానే నేడు రాష్ట్రవ్యాప్తం అద్బుతంగా నిలువనున్న పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌కోసం గ్రామాల్లో సైతం టీవీల ముందుంటే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తనకేమిపట్టదన్నట్టుగా పారిపోయి దుర్మార్గపు పార్టీగా నిలుస్తుందని ఎద్దేవా చేశారు. నాడుతెలంగాణా ఉద్యమంలో కూడా నేరుగా పోరాడిన చరిత్ర లేని తెలంగాణా కాంగ్రెస్‌ నేతలు నేడు కూడా బంగారు తెలంగాణాలో భాగస్వాములు కాకుండా దూరంగాఉంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత పదేళ్లుగా తెలంగాణాలో నీటి లభ్యత, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఎక్కడ గ్రామాలు తక్కువగా మునుగుతాయనే అంశంపై సుదీర్ఘంగా మేధో మధనం చేసినేడు కార్యరూపం చేసి అందరికి చూపించాలనుకుంటే కూడా జీర్ణించుకోకుండా విమర్శలు చేయడం తగునా అని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ఆలోచనా విధానం మార్చుకోవాలన్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తర్వాత ఈరోజు, రేపు కూడా ప్రతిపక్షాలకు సలహాలు, సూచనలను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నాకూడా బాద్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు భేషజాలకు పోకుండా వెంటనే వెనుతిరిగి మంచి చారిత్రక ఘట్టంగా నిలువనున్న జలవిదానంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు హాజరు కావాలని నారదాసు హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *