Monday, 2 November 2026

జాతి వారసత్వ సంపద కాపాడాల్సిందే

2

మెట్రో అలైన్‌మెంట్‌ మార్చాల్సిందే

ఎల్‌అండ్‌టీకి ప్రతిపాదనలు పంపాలని తెలంగాణ సర్కారు నిర్ణయం

సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌, నవంబర్‌ 25 (జనంసాక్షి) : జాతి వారస్వ సంపద కాపాడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. మెట్రో అలైన్‌మెంట్‌ మార్చాలని సూచించారు. అల్‌అండ్‌టీకి ప్రతిపాదనలు పంపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ నగరంలో చారిత్రక కట్టడాలు,దేవాలయాలు,మసీదులు,ప్రజల మనోభావాలతో ముడిపడిన చిహ్నాలకు ఎటువంటి విఘాతం కలగకుండా మెట్రో ప్రాజెక్టును పూర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌,ఎల్‌ అండ్‌ టి సంస్థను కోరారు.  పాతబస్తీలో మెట్రో అలైన్‌ మెంట్‌ మార్పులకు సంబంధించి మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ హాజరయ్యారు. అలైన్మెంట్‌ మార్చకపోతే దేవాలయాలు, మసీదులు,వెయ్యికి పైగా నివాస గృహాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని , మెట్రో అలైన్‌ మెంట్‌ మార్పు అనివార్యమని అక్బర్‌ వివరించారు. అలైన్‌ మెంట్‌ మార్పుకు ఎల్‌ అండ్‌ టి సంస్థ కూడా అంగీకరించిందని , అయితే అదనపు వ్యయం చెల్లించే విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. దీనిపై సీఎం మాట్లాడుతూ,మెట్రో రైలు ప్రాజెక్టు కోసం మొదట్లో ప్రతిపాదించిన  అలైన్‌ మెంట్‌ లో మూడు మార్పులు సూచించామని వెల్లడించారు. అసెంబ్లీ,అమర వీరుల స్థూపం పవిత్రతను కాపాడేందుకు అసెంబ్లీ వెనక భాగం నుంచి మెట్రో రైలు రూట్‌ మారాలని చెప్పారు. సుల్తాన్‌ బజార్‌ వద్ద లైన్‌ ను కూడా మార్చాలన్నారు. బడిచౌడి నుంచి ఉమెన్స్‌ కాలేజ్‌ వెనక భాగం ద్వారా ఇమ్లిబన్‌ కు చేరే విధంగా కొత్త రూటు ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పాతబస్తీ లో ప్రస్తుతం ఉన్న అలైన్‌ మెంటు జరిగితే హిందు దేవాలయాలు,మసీదులు,గృహాలు దెబ్బతింటాయని ,వీటికి ఇబ్బంది కలగకుండా కొత్త రూటు నిర్మించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. వీటిని అధికారికంగా బుధవారం ఎల్‌ అండ్‌ టి చైర్మన్‌ కు అందజేయాలని సీఎం మెట్రో రైలు ఎండీ ఎన్‌ విఎస్‌.రెడ్డి ని ఆదేశించారు. ఈ సమావేశంలో మెట్రో రైలు సిఇవొ జియావుద్దీన్‌,సీఎస్‌ రాజీవ్‌ శర్మ,ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి నర్సింగ రావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *