జార్ఖండ్ నవంబర్ 23 (జనంసాక్షి) : జార్ఖండ్ వెనుకబాటుకు భారతీయ జనతాపార్టీయే కారణమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. పాలమావ్ జిల్లాలోని పంకీలో శనివారం ఎన్నికల సభలో ఆమె మాట్లాడారు. నల్లధనాన్ని వెనక్కి తెప్పించడంలో భాజపా ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ విమర్శించారు. పరిపాలన అనేది ఎంతో ఓర్పు…నేర్పు…చిత్తశుద్ధితో కూడిన కళ పేర్కొన్నారు. భాజపాకు ఇలాంటి సామర్థ్యాలేవీ లేవన్నారు. ఒకప్పుడు ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భాజపా తూర్పార బట్టిందని పేర్కొన్నారు. ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెంచడం ప్రధానమనీ…కేవలం చీపుర్లు చేతుల్లో పట్టుకోవడం కానేకాదంటూ నరేంద్రమోదీ ‘స్వచ్ఛ భారత్’ ఉద్యమంపై విమర్శలు గుప్పించారు. ఛోటానాగ్‌పూర్, సంతాల్ పరగణాల్లో కౌలుదారి చట్టాలకు సవరణలు చేసేందుకు భాజపా ఎత్తులు వేస్తోందన్నారు. గిరిజనుల భూములను పరిరక్షించే ఈ చట్టాలకు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సవరణలను అనుమతించబోదని స్పష్టంచేశారు. ఝార్ఖండ్‌లో భాజపా పరిపాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. హరిత విప్లవం, గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహిళా రిజర్వేషన్లు, స.హ.చట్టం వంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినవేననన్నారు. లాటేహార్ జిల్లాలోని మనికాలో ఎన్నికల సభలో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొనిపోవాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని రాహుల్‌గాంధీ చెప్పారు.
అధికారంలోకి వచ్చి వందరోజులైనా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని రప్పించడంలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం విఫలమైందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పంకీలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… నల్లధనాన్ని తెప్పించడంలో విఫలమైందని కాంగ్రెస్‌ను ఎగతాళి చేసిన బీజేపీ ఇప్పుడు తానేం చేస్తోందని ఎద్దేవా చేశారు. విదేశీ బ్యాంకులనుంచి నల్లధనాన్ని తెప్పించడంలో బీజేపీ ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. నల్లధనం విషయంలో అనేక దౌత్య కారణాలు ఆలస్యానికి కారణమయ్యాయనీ, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా అవే కారణాలు చెబుతోందని తెలిపారు. పరిపాలన చేయాలంటే చాలా ఓపిక కావాలనీ, బీజేపీకి ఆ గుణం లేదనీ విమర్శించారు. మనసుకు నచ్చింది చేసుకుంటూ పోవడం పరిపాలన కాదన్నారు. పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలనే ఆలోచన, స్పృహ ప్రజల్లో కలిగించాలే తప్ప వారి చేతుల్లో చీపుర్లు పెడితే ప్రయోజనం ఉండదని ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంపై వ్యాఖ్యానించారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14 ఏళ్లలో తొమ్మిదేళ్లు బీజేపీయే అధికారంలో ఉందనీ, అవినీతిని పెంచి పోషించిందనీ విమర్శించారు. జార్ఖండ్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.





