జీతాలు చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

కర్నూలు,మే15(జ‌నం సాక్షి ): ఆదోని పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం పురపాలక కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్నెల్లు గడుస్తున్నా ఇంకా తమకు జీతాలు ఇవ్వలేదన్నారు. చాలీచాలని జీతాలతో ఇల్లు గడవక కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛభారత్‌ కింద పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు విడుదలైన నిధులు సైతం ఖర్చుచేయలేదన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కార్యాలయ ప్రధాన ద్వారానికి అడ్డుగా కూర్చున్నారు. వీరి ఆందోళనకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు