Tuesday, 3 November 2026

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఉత్కంఠకు తెర

 lw0sbq0w

హైదరాబాద్: ఎట్టకేలకూ జిహెచ్ ఎంసి ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. రెండు నెలల సుదీర్ఘ వాదనల తర్వాత… హైకోర్టు తుదితీర్పు చెప్పింది. ఎన్నికలు 225 రోజుల్లో పూర్తి చేయాలని ఉన్నత ధర్మాసనం ఆదేశించింది. హైదరాబాద్‌లో డిసెంబర్ 4 నుంచి కమిషనర్ ప్రత్యేక పాలన కొనసాగుతోంది. స్థానిక సంస్థ అయిన జిహెచ్ ఎంసికి ప్రత్యేకాధికారి పాలన మంచిది కాదని ఫోరంఫర్ గుడ్‌గవర్నెన్స్‌ హైకోర్టును ఆశ్రయించింది. 3 నెలల్లోనే ఎన్నికలు నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. పిల్ స్వీకరించిన న్యాయస్థానం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలపాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వార్డుల పునర్విభజన, 2011 జనాభా లెక్కల ప్రకారం ఓటర్ల రిజర్వేషన్ ముఖ్యం కావడంతో.. మొదట 249 రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఐతే అన్ని రోజులు ఇవ్వలేమని అంత సమయమెందుకో వివరిస్తూ నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
6 నెలల్లో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల పూర్తికి ఆదేశం
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం… 6 నెలల్లో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత 45 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికలు, ఫలితాలు పూర్తి చేయాలని సూచించింది. ఐతే హైదరాబాద్.. సింగపూర్ దేశం కంటే పెద్దదని.. అందుకు 7 నెలల సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరారు. ఈ ప్రతిపాదనను ధర్మాసనం తిరస్కరించింది. తెలంగాణ ఏర్పాటు పక్రియలో విమానంలో పేపర్స్ వచ్చాయని.. అంతే వేగంతో అధికారులు చిత్తశుద్దితో పని చేయాలని వాఖ్యానించింది.
కోర్టు తీర్పుపట్ల ప్రజా సంఘాలు హర్షం
కోర్టు తీర్పుపట్ల ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎన్నికలు ఆలస్యం కావటం వల్ల… జీహెచ్‌ఎంసీ కేంద్రం నుంచి ఇప్పటికే 760 కోట్ల గ్రాంట్లను నష్టపోయిందని… ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *